ముగిసిన ఏపీ తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్

ముగిసిన ఏపీ తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ముగిసిన పంచాయితీ ఎన్నికలు మొదటి విడత ప్రక్రియ..

ఏపీలో తొలి దశ పోలింగ్ ముగిసింది. ఉదయం ఆరున్నర గంటలకు ప్రారంభమైన పోలింగ్.. కాసేపటి క్రితమే పూర్తయింది. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం ఒంటి గంటా 30 నిమిషాలకే పోలింగ్ ముగిసింది. విజయనగరం జిల్లా మినహా మిగిలిన 12 జిల్లాల పరిధిలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో తొలిసారిగా నోటాను అందుబాటులోకి తెచ్చారు అధికారులు. కరోనా పాజిటివ్‌ బాధితులకు పీపీఈ కిట్లతో చివరిలో గంటసేపు అవకాశం కల్పించారు. ఇక మూడున్నర లోపు.. గేటు లోప‌ల ఉన్నవారికి మాత్రమే ఓటు వేసే అవ‌కాశం కల్పిస్తున్నారు అధికారులు.

సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఫలితాల వెల్లడి అనంతరం ఉప సర్పంచ్‌ ఎన్నిక ఉంటుంది. 4గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది. కౌంటింగ్ కోసం 14వేల 535 సూపర్‌వైజర్లు, 37వేల 750 మంది సిబ్బంది పని చేయనున్నారు. పోలింగ్‌ ముగిసిన అనంతరం ఎన్నికల సిబ్బంది తొలుత ఒకటో వార్డు బాక్సు ఓపెన్‌ చేస్తారు. సర్పంచ్‌, వార్డు సభ్యులకు సంబంధించిన బ్యాలెట్‌ పత్రాలను వేరుచేసి.. పాతిక చొప్పున కట్టలు కడతారు.

సర్పంచ్‌ ఎన్నికకు సంబంధించిన బ్యాలెట్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారికి అప్పగిస్తారు. వార్డులవి లెక్కించి, ఎప్పటికప్పుడు ఫలితాలు ప్రకటిస్తారు. వెంటనే అభ్యర్థుల సంతకాలు తీసుకుని రెండో వార్డు బాక్సు ఓపెన్‌ చేస్తారు. ఇలా మొదట పంచాయతీలో వార్డుల లెక్కింపు పూర్తిచేస్తారు. వార్డులన్నీ పూర్తయిన తరువాత సర్పంచ్‌కు సంబంధించిన బ్యాలెట్‌ పత్రాలను ఒక డబ్బాలో వేసి కలిపి...ఆ తరువాత లెక్కింపు చేపడతారు.

ఇక రాష్ట్రవ్యాప్తంగా 29వేల 732 కేంద్రాల్లో పోలింగ్‌ జరిగింది. మొత్తం 12 జిల్లాల్లోని 3వేల 249 పంచాయతీలకు పోలింగ్ నిర్వహించారు. 32వేల 502 వార్డుకు ఎన్నికలు జరిగాయి. సర్పంచ్ స్థానాలకు 7వేల 506 మంది అభ్యర్థులు పోటీ పడగా.. వార్డు సభ్యుల స్థానాలకు 43వేల 601 మంది బరిలో ఉన్నారు. పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు హోరాహోరిగా ప్రచారం నిర్వహించారు. మరికొన్ని గంటల్లో వీరి భవితవ్యం తేలనుంది.

Tags

Read MoreRead Less
Next Story