AP: నేడు ఆంధ్రప్రదేశ్‌కు ప్రధాని మోదీ

ప్రధాని మోదీ నేడు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటించనున్నారు. ఢిల్లీ నుంచి ఓర్వకల్లు విమాన్రాశయం చేరుకొని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో శ్రీశైలం చేరుకుంటారు. జ్యోతిర్లింగం, శక్తిపీఠం క్షేత్రాలను దర్శించుకుంటారు. మల్లికార్జునస్వామి, భ్రమరాంబిక దేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. శ్రీశైలంలోని ఘంటా మఠంలో పురావస్తు శాఖ ప్రదర్శించిన 21 సెట్ల తామ్ర శాసనాలను, 53 రాగి రేకులను, నాణేలను తిలకిస్తారు. ఆ తర్వాత ప్రత్యేక హెలికాప్టర్లో కర్నూలు నగర శివారున ఓర్వకల్లు మండలం నన్నూరు టోల్ ప్లాజా దగ్గర రాగమయూరి గ్రీన్హిల్స్కు చేరుకుంటారు. అక్కడ ‘సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్’ భారీ బహిరంగ సభలో మోదీ పాల్గొంటారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు రూ.13,429 కోట్లతో నిర్మించనున్న 16 ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. దేశంలోనే జీఎస్టీ-2.0పై అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న తొలి సభ ఇది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ సహా కేంద్ర, రాష్ట్ర మంత్రులు, కూటమి పార్టీల ప్రముఖ నాయకులు హాజరుకానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రధాని సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. సభకు 3 లక్షల మందికి పైగా హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రభుత్వమంతా కర్నూలులోనే..
మంత్రివర్గం మొత్తం కర్నూలులో మకాం వేసింది. దాదాపు వంద మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, రాయలసీమ జిల్లాలు సహా ప్రకాశం, గుంటూరు జిల్లాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, టీడీపీ ముఖ్య నేతలు తమకు కేటాయించిన బాధ్యతల్లో నిమగ్నమయ్యారు. మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, బీసీ జనార్దన్‌రెడ్డి, టీజీ భరత్, ఎన్ఎండీ ఫరూక్, నారాయణ, అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవికుమార్, సత్యకుమార్, అనగాని సత్యప్రసాద్, వంగలపుడి అనిత, రాంప్రసాద్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్ తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు. ప్రధాని మోదీ పర్యటనను జయప్రదం చేయాలని మంత్రులు, టీడీపీ, బీజేపీ రాష్ట్ర నాయకులు విజ్ఞప్తి చేశారు. కర్నూలులోని ప్రభుత్వ అతిఽథి గృహంలో భారీ జన సమీకరణపై కర్నూలు, నంద్యాల జిల్లాల కూటమి పార్టీల ముఖ్య నాయకులతో మంత్రులు సమావేశం నిర్వహించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com