AP Rains: ఏపీని మళ్లీ ముంచెత్తుతున్న వర్షాలు.. ముఖ్యంగా ఆ రెండు జిల్లాల్లో..

AP Rains (tv5news.in)

AP Rains (tv5news.in)

AP Rains: ఏపీని మళ్లీ వర్షాలు భయపెడుతున్నాయి.

AP Rains: ఏపీని మళ్లీ వర్షాలు భయపెడుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాల నుంచి కోలుకోక ముందే భారీ వర్షాలు పడుతుండడంతో జనం ఆందోళన చెందుతున్నారు. నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల్లో ఎడతెరిపిలేకుండా వర్షం పడుతోంది. నెల్లూరు జిల్లాలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. చెరువులు నిండుకుండలను తలపిస్తుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నెల్లూరు,కడప జిల్లాల్లో మళ్లీ భారీ వర్షాలు పడుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాల ఎఫెక్ట్‌ నుంచి కోలుకోక ముందే మళ్లీ వర్షాలు పడుతుండడంతో జనం ఆందోళన చెందుతున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పరిసర ప్రాంతాల్లో శనివారం రాత్రి నుంచి తెరిపిలేకుండా వర్షం కురిసింది.

ఆత్మకూరు, అనంతసాగరం, మర్రిపాడు, చేజర్ల, సంగం, AS పేట, సూళ్లూరుపేట మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఇటీవల కురిసిన వానలకు వాగులు,వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండగా.. ఇప్పుడు కురిస్తున్న వర్షాలకు మరింత ఉగ్రరూపం దాల్చాయి. ఆత్మకూరు పరిధిలో అత్యధికంగా పది సెంటిమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. సంగంలోనూ 10 సెంటీమీటర్ల వాన పడింది.

సోమశిల కాలవకు వరద పోటెత్తడంతో ఆత్మకూరు, అనంతసాగర్ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.. సూళ్లూరుపేట, తడ మండలాల్లోని లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రేవూరు దగ్గర ఉన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. శంకర్ నగరం, రేవూరు గ్రామాల్లోని ఎస్సీకాలనీల్లోకి భారీగా వరదనీరు చేరింది.దీంతో ఇళ్లల్లో ఉండలేక రోడ్లపైకి వచ్చారు బాధితులు. అధికారులు వచ్చేవరకు కదిలేది లేదని నిరసనకు దిగారు.

కడప జిల్లానూ వర్షాలు వదలడం లేదు.. ఇప్పటికే జిల్లాలోని చెరువులన్నీ నిండు కుండలను తలపిస్తున్నాయి. ఏ క్షణమైన తెగే ప్రమాదం ఉందని సమీప గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు.. చిట్వేలి మండలం అనుంపల్లి చెక్‌పోస్ట్‌ సమీపంలో రాజగుంట అలుగు ఉగ్రరూపం దాల్చింది. రోడ్డుపై నుంచి భారీగా వరద ప్రవహిస్తుంది.

చిట్వేలి నుంచి రాపూరు మీదుగా నెల్లూరు వెళ్లాల్సిన వాహనాలను ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. చింతకొమ్మదిన్నె మండలం ఉటుకూరు చెరువు ప్రమాదకరంగా మారింది. ప్రస్తుతం పూర్తి స్థాయిలో చెరువు నిండింది. తాత్కాలిక మరమ్మతులు చేసిన చోట కట్ట కుంగడంతో దిగువ ప్రాంతాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విశ్వ ప్రకృతినగర్‌, బాలాజీనగర్‌, భగత్‌సింగ్ నగర్‌, అల్లూరి సీతారామనగర్‌తో పాటు ఐటీ సర్కిల్‌ కాలనీలకు ముప్పు పొంచి ఉంది.

అప్రమత్తమైన అధికారులు సహాయకచర్యలకు సిద్ధమయ్యారు. అటు చిత్తూరు జిల్లాలోనూ వర్ష బీభత్సం కొనసాగుతోంది. తిరుపతిలో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్ని చెరువులను తలపించాయి. ప్రధాన కూడళ్లలో మోకాళ్లలోతు నీరు నిలవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎడతెరిపిలేకుండా వర్షాలకు జనం బిక్కు బిక్కు మంటున్నారు.

భారీ వర్షాలతో చిత్తూరు జిల్లాలో సోమవారం స్కూళ్లు,కాలేజీలకు సెలవు ప్రకటించారు. ఘాట్‌రోడ్డులో ముందు జాగ్రత్తగా రాత్రి సమయంలో ఆంక్షలు విధించారు. అల్పపీడన ప్రభావంతో ఈ నెల 30 నుంచి నెల్లూరు,చిత్తూరు, కడప, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో అధికారులు, ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ముందస్తు చర్యల్లో భాగంగా పునరావాసకేంద్రాలకు తరలిస్తున్నారు

Tags

Read MoreRead Less
Next Story