AP: ఏపీలో రాజ్యసభ ఎంపీ పదవుల సందడి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల చర్చ వేడెక్కుతోంది. వచ్చే నెలలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానుండటంతో అధికార కూటమిలో ఇప్పటికే ఆశావహుల కదలికలు ప్రారంభమయ్యాయి. ఇంకా అధికారిక ప్రక్రియ మొదలుకాకముందే పదవుల కోసం లాబీయింగ్ జోరందుకోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా కూటమిలో భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల పంపకాలపై స్పష్టత రాకముందే నేతలు తమ పేర్లు పరిశీలించాలని అధిష్టానాలకు వినతులు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం వైఎస్సార్సీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పరిమళ్ నత్వానీ, సానా సతీష్‌ల పదవీకాలం వచ్చే నెలతో ముగియనుంది. ప్రస్తుత అసెంబ్లీ బలాబలాలను పరిశీలిస్తే ఈ నాలుగు స్థానాలు కూడా ఎన్డీయే కూటమి ఖాతాలోకి వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ నాలుగు స్థానాలను కూటమిలోని ఏ పార్టీకి ఎన్నిచొప్పున కేటాయించాలన్న అంశంపై ఇంకా తుది నిర్ణయం వెలువడలేదు.
రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న చర్చల ప్రకారం రెండు స్థానాలు తెలుగుదేశం పార్టీ తీసుకుని, మిగతా రెండు స్థానాలను జనసేన, బీజేపీలకు చెరో ఒకటి చొప్పున కేటాయించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే పరిస్థితులను బట్టి ఈ ఫార్ములాలో మార్పులు ఉండొచ్చని కూడా అంటున్నారు. ముఖ్యంగా బీజేపీకి ఇప్పటికే ఏపీ నుంచి ఇద్దరు రాజ్యసభ సభ్యులు ఉండటంతో మరోసారి అవకాశం ఇస్తారా లేదా అన్న అంశం చర్చనీయాంశంగా మారింది. ఇక టీడీపీ అంతర్గతంగా చూస్తే రాజ్యసభ రేసు మరింత ఆసక్తికరంగా కనిపిస్తోంది. పార్టీ సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ ప్రాతినిధ్యం, సీనియారిటీ, గతంలో అవకాశాలు కోల్పోయిన నేతలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థుల ఎంపిక చేయాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే పలువురు నేతలు తమకే అవకాశం కల్పించాలని ప్రయత్నాలు ప్రారంభించారు.
ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం. అదే సమయంలో కంభంపాటి రామ్మోహన్, మాజీ ఎంపీ గల్లా జయదేవ్, టీడీపీ నేత టీడీ జనార్దన్, భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ పేర్లు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. గుంటూరు నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచిన గల్లా జయదేవ్ మళ్లీ పార్లమెంట్‌కు వెళ్లాలన్న ఆసక్తితో ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కీలక నేత వర్ల రామయ్య పేరు కూటా చాలా బలంగా వినిపిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
