AP: ఆంధ్రప్రదేశ్‌ను ఆందోళన పరుస్తున్న టీనేజ్ ప్రెగ్నెన్సీలు

టీనేజ్ వయసులో గర్భధారణలు పెరుగుతున్నాయంటే అది అది సమాజ భవిష్యత్తుకు పెను ప్రమాదం. చదువు మధ్యలో ఆగిపోవడం, బాల్య వివాహాల ప్రభావం, సరైన అవగాహన లోపం, ఆరోగ్య సమస్యలు, తల్లి–శిశు మరణాల ముప్పు… ఇవన్నీ టీనేజ్ ప్రెగ్నెన్సీలతో ముడిపడి ఉన్న తీవ్రమైన పరిణామాలు. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా వెలుగులోకి వచ్చిన గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్రంలో చాలా జిల్లాల్లో టీనేజ్ ప్రెగ్నెన్సీలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నట్టు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. 2025–26 సంవత్సరానికి సంబంధించిన తాజా గణాంకాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లో అనేక జిల్లాల్లో టీనేజ్ ప్రెగ్నెన్సీ రేటు 12 శాతానికి మించి నమోదైంది. ముఖ్యంగా నెల్లూరు, పల్నాడు, ప్రకాశం, అనంతపురం, బాపట్ల, కర్నూలు జిల్లాలు ఈ విషయంలో టాప్‌లో నిలిచాయి. ఈ జిల్లాల్లో ప్రతి వంద మంది టీనేజ్ బాలికల్లో కనీసం 12 మందికి పైగా గర్భధారణ నమోదవడం తీవ్ర పరిస్థితిని సూచిస్తోంది. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది భవిష్యత్తులో మరిన్ని సామాజిక, ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చని హెచ్చరిస్తున్నారు.
ఇక కొన్ని జిల్లాల్లో పరిస్థితి కొంత తక్కువగా ఉన్నప్పటికీ, అది కూడా సురక్షిత స్థాయిలో లేదనే చెప్పాలి. ఏలూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, సత్యసాయి, నంద్యాల జిల్లాల్లో టీనేజ్ ప్రెగ్నెన్సీలు 10 నుంచి 12 శాతం మధ్యలో నమోదయ్యాయి. ఈ గణాంకాలు కూడా నిర్లక్ష్యం చేయదగ్గవి కాదని నిపుణులు చెబుతున్నారు. టీనేజ్ దశలో అమ్మాయిల శరీరం పూర్తిగా ఎదగకముందే గర్భధారణ జరిగితే, తల్లి ఆరోగ్యంతో పాటు శిశువు ఆరోగ్యంపై కూడా తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు.
అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల్లో 8 నుంచి 10 శాతం మధ్యలో టీనేజ్ ప్రెగ్నెన్సీలు నమోదయ్యాయి. ఈ జిల్లాల్లో పరిస్థితి కొంత నియంత్రణలో ఉన్నట్లు కనిపిస్తున్నా, ఇంకా లక్ష్య స్థాయికి దూరంగానే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే, టీనేజ్ గర్భధారణలు ఒక జిల్లాకే పరిమితం కాకుండా, దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ విస్తరించిన సమస్యగా మారినట్టు గణాంకాలు చెబుతున్నాయి. విశాఖపట్నం జిల్లాలో మాత్రమే టీనేజ్ ప్రెగ్నెన్సీలు అత్యల్పంగా 3.98 శాతంగా నమోదయ్యాయి. ఇది ప్రభుత్వ చర్యలు, విద్యా అవగాహన కార్యక్రమాలు, వైద్య సేవల అందుబాటు వల్ల సాధ్యమై ఉండొచ్చని అంచనా. మిగిలిన తొమ్మిది జిల్లాల్లో మాత్రం టీనేజ్ గర్భధారణలు ఓ మాదిరి స్థాయిలో కొనసాగుతున్నట్టు గణాంకాలు సూచిస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే ఈ సమస్యపై దృష్టి సారించింది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రవ్యాప్తంగా టీనేజ్ ప్రెగ్నెన్సీ రేటు 5 శాతానికి మించకుండా తగ్గించాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది. రాష్ట్ర సగటు టీనేజ్ ప్రెగ్నెన్సీ రేటు 8.8 శాతంగా ఉండటం తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది. ఈ లక్ష్యాన్ని సాధించాలంటే కేవలం ప్రభుత్వ చర్యలే కాకుండా సమాజం కూడా జాగురుతం చేయాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
