Anandayya Medicine: ఆనందయ్య మందుకి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గ్రీన్ సిగ్నల్

Anandayya Medicine: మనుషులు చచ్చిపోతున్నారు. ప్రాణాలు కాపాడుకోడానికి ఏం చేయమన్నా చేసేలా ఉన్నారు. అల్లోపతి, ఆయుర్వేదం, ఆకుపసర్లు ఏవైతేనేం కరోనా మహమ్మారిని పారద్రోలడానికి ఏదో ఒకటి చెయ్యండి బాబు అని వేడుకుంటున్నారు. ఆక్సిజన్ కోసం పరిగెత్తలేక ఆయాసం వస్తోంది. ఊపిరి ఆగిపోతుంది.
డాక్లర్లు, మందులు, ఐసీయూలో బెడ్లు, లక్షల్లో బిల్లులు ఇవేవీ ప్రాణాలు కాపాడలేకపోతున్నాయి. వయసుతో నిమిత్తం లేకుండా కోవిడ్ వస్తే కోలుకుంటాడో లేదో అని ప్రాణాలు ఉగ్గబట్టుకోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆనందయ్య మెడిసిన్ అమృతంలా పని చేస్తుందంటే అందరూ అక్కడికి క్యూ కడుతున్నారు.
జనం నమ్మకాన్ని వమ్ము చేయని ప్రభుత్వం దానిపై రివ్యూ పెట్టింది. మందులో ఉన్న శాస్త్రీయతను గుర్తించమంది. రంగంలోకి దిగిన ఆయుష్ కమీషనర్ ఇచ్చిన ప్రాథమిక సమాచారం ప్రకారం నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య తయారు చేస్తున్న మందు పంపిణీకి అభ్యంతరం లేదని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.
ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఆనందయ్య తయారు చేప్తున్న ఔషధంలో ఎలాంటి హానికర పదార్థాలు లేవని అన్నారు. ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చాక తుది నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నారు.
అయితే ఆయుర్వేద మందుగా దీన్ని గుర్తించడం లేదని, అలా చేయాలంటే కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం శాస్త్రీయతపై నిర్ధారణ, ఇతర అనుమతులు అవసరమవుతాయని ఆయన వివరించారు.
ఇదిలా ఉండగా ఆనందయ్య మందును ప్రజలకు చేరువ చేయడంపై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టిందని నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ఈ మందు వాడకం ప్రజల అభిప్రాయం తెలుసుకున్న తరువాత, ప్రభుత్వ అనుమతితో జిల్లా వ్యాప్తంగా అవసరమైన వారందరికి పంపిణీ చేసే బాధ్యత తనదని అన్నారు.
ఈ ఔషధాన్ని ఆయుష్, ఐసీఎంఆర్ ఆమోదిస్తే తితిదే ఆధ్వర్యంలో తయారు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తామని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com