కోర్టుకు వెళ్తూ సంచలన వ్యాఖ్యలు చేసిన అచ్చెన్నాయుడు

కోర్టుకు వెళ్తూ సంచలన వ్యాఖ్యలు చేసిన అచ్చెన్నాయుడు
టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు 14 రోజుల రిమాండ్

టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. సర్పంచి అభ్యర్ధిని బెదిరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న అచ్చెన్నాయుడిని.. ఈ ఉదయం అరెస్ట్ చేశారు. అచ్చెన్న అరెస్టు సమయంలో నిమ్మాడలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అచ్చెన్నాయుడు అరెస్టుపై టీడీపీ నేతలు మండిపడ్డారు. ఏపీలో నియంతపాలన సాగుతోందని విమర్శించారు.

బంధువులతో మాట్లాడిన మాటలను బెదిరింపు కాల్స్‌గా చిత్రీకరించి.. అచ్చెన్నాయుడును అరెస్ట్ చేశారని మండిపడింది టీడీపీ. అచ్చెన్నాయుడు సొంత ఊరైన నిమ్మాడలో ఆయన భార్య సర్పంచ్ పదవికి నామినేషన్ వేశారు. ఆమెపై పోటీకి అచ్చెన్నాయుడుకు వరసకు అన్న కుమారుడైన కింజారపు అప్పన్నను వైసీపీ బరిలో నిలిపింది. ఇదే సమయంలో అప్పన్నను కన్విన్స్ చేయడానికి మాట్లాడారు అచ్చెన్నాయుడు. కాని, తాను నామినేషన్ వేయకుండా అచ్చెన్నాయుడు బెదిరింపులకు పాల్పడ్డారని అప్పన్న ఆరోపించారు. ఈ కేసులో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిమ్మాడలో ఇంటి దగ్గర అదుపులోకి తీసుకుని కోటబొమ్మాళి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కోర్టులో హాజరుపరిచారు. కోటబొమ్మాళి కోర్టు అచ్చెన్నాయుడుకు 14 రోజుల రిమాండ్ విధించడంతో.. సబ్‌జైలుకి తరలించారు. అచ్చెన్న అరెస్ట్‌తో నిమ్మాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది.

కోర్టుకు వెళ్తున్నప్పుడు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపు అధికారం టీడీపీదేనని, చంద్రబాబుకు చెప్పి తానే హోంమంత్రిని అవుతానని అన్నారు. తప్పుడు కేసులు పెడుతున్న పోలీసులను ఎక్కడున్నా విడిచిపెట్టేది లేదన్నారు. నోటీసులు ఇస్తే తానే పోలీస్‌ స్టేషన్‌కు వచ్చేవాడినని, అలాంటిది డీఎస్పీ, సీఐలు బెడ్‌రూమ్‌కు వచ్చి తీసుకెళ్లడం ఏంటని ప్రశ్నించారు. ఖాకీ డ్రస్ అంటేనే విరక్తి వస్తోందని.. పోలీసుల్ని చూసి ఉద్యోగులు సిగ్గు పడుతున్నారన్నారని కామెంట్ చేశారు.

అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడు అరెస్ట్ జగన్ రెడ్డి కక్ష సాధింపునకు పరాకాష్ట అన్నారు. ఉత్తరాంధ్రపై జగన్ కక్ష కట్టారని.. అందుకే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలలో భయోత్పాతం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. నిమ్మాడలో గత 40ఏళ్లలో ఏనాడూ ఇలాంటి ఉద్రిక్తతలు లేవని, ప్రశాంత గ్రామంలో ఉద్రిక్తతలు సృష్టించింది ఎవరని ప్రశ్నించారు. దువ్వాడ శ్రీనివాస్ స్వగ్రామానికి అచ్చెన్నాయుడు వెళ్లారా లేక అచ్చెన్న స్వగ్రామానికి దువ్వాడ వచ్చి ఘర్షణలు రెచ్చగొట్టారా చెప్పాలని డిమాండ్ చేశారు. దువ్వాడ శ్రీనివాస్ బెదిరింపులపై ఫోటోలు, వీడియో సాక్ష్యాధారాలు ఉన్నా.. కేసు పెట్టకుండా అచ్చెన్నాయుడుపై తప్పుడు కేసు పెట్టడం ఏంటని మండిపడ్డారు. దీనికి తగిన మూల్యం జగన్ రెడ్డి చెల్లించక తప్పదని చంద్రబాబు హెచ్చరించారు.

అచ్చెన్నాయుడు అరెస్ట్ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశాయి. టీడీపీ సీనియర్‌ నేతలు కళా వెంకట్రావు, కూన రవికుమార్‌, కలమట వెంకటరమణ, బెందాళం అశోక్‌ సహా మాజీ ఎమ్మెల్యేలను పోలీసులు హౌజ్‌ అరెస్టులు చేశారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

బీసీ నాయకుడు పార్టీ అధ్యక్షుడిగా ఉండడాన్ని సహించలేకే అచ్చెన్నాయుడును అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. అచ్చెన్న స్వగ్రామంలో నడిరోడ్డుపై మారణాయుధాలతో వీరంగం చేసిన వైసీపీ నేత దువ్వాడ శ్రీనుపై ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు.

Tags

Next Story