AP: ఏపీలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం

ప్రతిష్ఠాత్మక 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు విశాఖలో ప్రారంభమైంది. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఈ సదస్సును ప్రారంభించారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు పీయూష్‌గోయల్, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస వర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సదస్సుకు సీఐఐ అధ్యక్షడు రాజీవ్ మెమానీ, సీఐఐ డైరెక్టర్ చంద్రజిత్ బెనర్జీతోపాటు దేశవిదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. మన దేశం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని సీఐఐ అధ్యక్షుడు రాజీవ్ అన్నారు. కేంద్రం సాయంతో ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతోందని.. రాష్ట్రానికి అనేక పెట్టుబడులు వస్తున్నాయన్నారు. చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రం వేగంగా ముందుకెళ్తోందని జీఎంఆర్ సంస్థ ఛైర్మన్ గ్రంధి మల్లిఖార్జునరావు కొనియాడారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం విమానాశ్రయం ఎంతో దోహదం చేస్తుందని వివరించారు.
సీఐఐ భాగస్వామ్య సదస్సులో భారత్ బయోటెక్ ఎండీ సుచిత్ర ఎల్ల మాట్లాడారు. వాణిజ్యంలో ఎదురయ్యే సవాళ్లు అధిగమిస్తూ భారత్ ముందుకెళ్తోందన్నారు. ‘‘గ్రీన్ఎనర్జీ ఉత్పత్తిలో స్వయంప్రతిపత్తి సాధించేలా అడుగులు వేస్తున్నాం. భాగస్వామ్యం, ఆవిష్కరణలు, విలువ ఆధారిత ఉత్పత్తులతోనే ఆత్మనిర్భర్ భారత్ సాధ్యమవుతుంది. కొవిడ్ వచ్చినప్పుడు ప్రపంచానికి వ్యాక్సిన్ అందించగలిగాం. జీనోమ్‌వ్యాలీ లాంటి ఎకోసిస్టమ్‌ను చంద్రబాబు తయారు చేశారు. అదే జీనోమ్‌వ్యాలీలో కొవిడ్ వ్యాక్సిన్ తయారు చేసి అందించాం’’ అని సుచిత్ర ఎల్ల అన్నారు.
పాలసీలపై చర్చ
భాగస్వామ్య సదస్సులో పాల్గొన్న వివిధ ప్రముఖ సంస్థలకు చెందిన పారిశ్రామిక వేత్తలు ఏపీలో జరుగుతున్న అభివృద్ధి గురించి... పారిశ్రామికాభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం తెచ్చిన పాలసీల గురించి మాట్లాడారు. అదానీ పోర్ట్స్, సెజ్ ఎండీ కరణ్ అదానీ మాట్లాడుతూ... స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో ఆంధ్రప్రదేశ్ ఆధునికంగా మారుతోందన్నారు. భారత దేశంలో వేగంగా ఎదుగుతున్న స్టార్టప్ స్టేట్‌గా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని కరణ్ అదానీ అభిప్రాయపడ్డారు. దీనికి మార్గదర్శిగా ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరిస్తున్నారని వెల్లడించారు. ఏపీలో డేటా సెంటర్లు, ఓడరేవులు, సిమెంట్ ఉత్పత్తి తదితర రంగాల్లో అదానీ సంస్థ పనిచేస్తోందని వివరించారు. ఏపీ వృద్ధిలో అదానీ సంస్థ కూడా భాగస్వామి అవుతోందని స్పష్టం చేశారు. నైపుణ్యం ఉన్న యువత, మానవ వనరులు, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ఏపీని మంత్రి నారా లోకేష్ తీర్చిదిద్దుతున్నారని కరణ్ అదానీ కితాబిచ్చారు. ఇక జీఎంఆర్ సంస్థ అధినేత గ్రంధి మల్లిఖార్జున రావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్‌కు అనుగుణంగా ఏపీలో అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయాలు వస్తున్నాయన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంలో భాగస్వామి అయినందుకు సంతోషంగా ఉందని జీఎమ్మార్ అధినేత చెప్పారు. ఇంటిగ్రేటెడ్ ఏరో స్పేస్ ఎకో సిస్టంను ఆంధ్రప్రదేశ్‌లో సిద్ధం చేస్తున్నామని... మెయింటెనెన్స్, రిపేర్స్, ఓవర్ హాలింగ్ సెంటర్ కూడా భోగాపురం ఎయిర్ పోర్టులో వస్తుందని జీఎమ్మార్ సంస్థ అధినేత ప్రకటించారు. ఇప్పటికే పలు కంపెనీలు ఏపీ ప్రభుత్వంతో పెట్టుబడులపై ఒప్పందాలు చేసుకున్నాయి. మొత్తం 40 దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. ఒకరోజు ముందుగానే ముఖ్యమంత్రి చంద్రబాబు 15 సమావేశాల్లో పాల్గొని ప్రతినిధులతో చర్చించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు రిలయెన్స్ సంస్థ అంగీకారం తెలిపింది. AI డేటా సెంటర్, సోలార్ పవర్ ప్లాంట్, గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటేడ్ ఫుడ్ పార్క్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

