AP: త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

AP: త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
X
విశాఖ నుంచే ప్రారంభిస్తామన్న ఏపీ రవాణశాఖ మంత్రి... త్వరలోనే మహిళలకు శుభవార్త...

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత రవాణ సదుపాయంపై ఏపీ రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి రామ్‌ప్రసాదరెడ్డి కీలక ప్రకటన చేశారు. విశాఖపట్నం నుంచే ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తామని, త్వరలోనే మహిళలకు శుభవార్త చెబుతామని వెల్లడించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేస్తున్నామన్న రామప్రసాదరెడ్డి... అవి చివరి దశకు చేరుకున్నాయని తెలిపారు. విశాఖ పర్యటనకు వచ్చిన మంత్రి... గత వైసీపీ ప్రభుత్వం ఆర్టీసీని పూర్తిగా ప్రభుత్వంలో విలీనం చేయలేదని, తాము ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అవసరం మేరకు బస్సుల సంఖ్య పెంచుతామని, ఎలక్ట్రికల్‌ సర్వీసులు అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించారు.

జగన్‌ హయాంలో రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలను తరిమేశారని, కొత్త వాటిని ప్రోత్సహించలేదన్నారు. టీడీపీ ప్రభుత్వం గతంలో ఒప్పందాలు చేసుకున్న పరిశ్రమలను ఇప్పుడు స్థాపించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు. వైసీపీ పాలనలో జగన్‌ తర్వాత ఎక్కువ అక్రమాలకు పాల్పడింది, అధిక మొత్తంలో అక్రమార్జన కూడబెట్టింది పెద్దిరెడ్డేనని మంత్రి రామ్‌ప్రసాదరెడ్డి ధ్వజమెత్తారు. రాయలసీమ జిల్లాల్లో పెద్దిరెడ్డిదే అతిపెద్ద మాఫియా కుటుంబమని, మొత్తం ఖనిజ సంపదను దోచేశారని మండిపడ్డారు. పెద్దిరెడ్డి కుటుంబానికి సంబంధించి ల్యాండ్, వైన్, మైన్‌ కుంభకోణాలను త్వరలోనే ఆధారాలతో సహా బయటపెడతామని చెప్పారు. శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందనే మిథున్‌రెడ్డికి అన్నమయ్య జిల్లా వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని, అందులో తప్పేముందని ప్రశ్నించారు.

ప్రారంభమైన పింఛన్ల పంపిణీ

ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. మూడు నెలల బకాయితో కలిపి ఒకేసారి రూ.7 వేలు పెన్షన్‌ పంపిణీని చంద్రబాబు ప్రభుత్వం ప్రారంభించింది. పెన్షన్ల పంపిణీని పండుగలా నిర్వహించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇందులో భాగమవుతున్నారు. మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో సీఎం చంద్రబాబు పింఛను పంపిణీని ప్రారంభించారు. మంత్రి లోకేశ్‌, ఇతర అధికారులతో కలిసి గ్రామానికి చేరుకున్న సీఎం.. లబ్ధిదారు ఇంటికి వెళ్లి స్వయంగా పింఛను అందజేశారు. లబ్ధిదారు కుటుంబసభ్యులతో మాట్లాడారు. పెనుమాకలోని సుగాలికాలనీకి చెందిన బాణావత్‌ పాములు నాయక్‌ కుటుంబం చంద్రబాబు నుంచి తొలి పింఛన్‌ అందుకున్నది. పాములు నాయక్‌కు వృద్ధాప్య పింఛన్‌, ఆయన కుమార్తె ఇస్లావత్‌ శివకుమారికి వితంతు పింఛన్‌ను వారి ఇంటి వద్ద చంద్రబాబు స్వయంగా అందజేశారు. పింఛన్ల పంపిణీ అనంతరం సీఎం చంద్రబాబు రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తారు. ఆయన పర్యటన నేపథ్యంలో పెనుమాక గ్రామం ముస్తాబయ్యింది.


Tags

Next Story