NEW YEAR: తెలుగు ప్రజలకు ప్రముఖుల శుభాకాంక్షలు

NEW YEAR: తెలుగు ప్రజలకు ప్రముఖుల శుభాకాంక్షలు
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు... కొత్త ఏడాది ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఆకాంక్ష

నూతన సంవత్సరం-2024 సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ గవర్నర్ ఎస్ . అబ్దుల్ నజీర్, సీఎం జగన్ కొత్త ఏడాది శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త సంవత్సరం ఉజ్వల భవిష్యత్తు కోసం ఎదురుచూడడానికి, కొత్త అవకాశాలను అన్వేషించడానికి, లక్ష్యాలను సాధించడానికి స్ఫూర్తిని ఇస్తుందని గవర్నర్ తెలిపారు. 2024లో ప్రతి ఇంట్లో సంతోషాలు నిండాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. అన్ని ప్రాంతాలు, సామాజిక వర్గాలు సుస్థిరమైన అభివృద్ధి పథంలో ప్రయాణించేలా తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

నూతన సంవత్సరానికి స్వాగతం పలికే వేళ తెలంగాణ ప్రజలకు గవర్నర్‌ తమిళిసై శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన ఏడాది ప్రజలకు సంతోషాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వాలని, శ్రేయస్సును అందించాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజలకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన ఏడాది.. కొత్త ఆశలు, కోరికలు, లక్ష్యాలు, ఆశయాలు, నిర్ణయాలు, వేడుకలు, ఉత్సాహం.. ప్రజలతో కలకాలం ఉండాలని అభిలషించారు. 2024లో ఇంటింటా ఆనందాలు, ప్రతీ కుటుంబంలో అభివృద్ధి కాంతులు వెల్లి విరియాలని, తెలంగాణలోని అన్ని సామాజిక వర్గాలు సుస్థిరమైన అభివృద్ధి పథంలో ప్రయాణించేలా ఉండాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజలకు భారాస అధినేత KCR నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే ఏడాది తెలంగాణ ప్రజల జీవితాల్లో సుఖ:శాంతులు నింపాలని కేసీఆర్‌ ఆకాంక్షించారు. పలువురు మంత్రులు, భారాస నాయకులు తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లో పోలీసులు పలు ఆంక్షలు విధించారు. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలుంటాయని, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ సహా నిబంధనల ఉల్లంఘనలపై కఠిన చర్యలుంటాయని పోలీసులు తెలిపారు. మహిళల భద్రత కోసం ప్రత్యేక షీ-టీమ్స్‌ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఔటర్‌రింగ్‌ రోడ్డు సహా అన్ని ఫ్లైఓవర్లపై వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 6 వరకు ఫ్లైఓవర్లు మూసివేస్తామన్నారు. శంషాబాద్ విమానాశ్రయం వెళ్లే వాహనదారులకు మాత్రమే ఔటర్‌రింగ్‌ రోడ్‌పై అనుమతి ఉందని, వారికి పాసులు తప్పనిసరిగా ఉండాలన్నారు. క్యాబ్‌లు, ఆటో డ్రైవర్లు యూనిఫామ్ ధరించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. వాహనదారుల వద్ద తప్పనిసరిగా డ్రైవింగ్‌ లైసెన్సు ఉండాలని, లైసెన్స్‌ లేకుండా వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రాత్రి 8 నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తామని తెలిపారు. పబ్‌లు, క్లబ్బుల్లో మద్యం సేవించి, బయటికొచ్చి వాహనాలు నడపొద్దని సూచించారు. మద్యం సేవించిన కస్టమర్లకు పబ్‌ యజమానులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. ఇతరులకు ఇబ్బందులు కలిగించకుండా బాధ్యతాయుతంగా కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోవాలని ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Tags

Read MoreRead Less
Next Story