Ap: మద్యం కుంభకోణంపై పార్లమెంట్లో గళమెత్తుతాం

జగన్ హయాంలో ఏపీలో జరిగిన మద్యం కుంభకోణంపై పార్లమెంట్ వేదికగా గళం విప్పుతామని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్న వేళ.. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన అఖిల పక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రూ.100 కోట్ల దాణా కుంభకోణంపైనే గతంలో పార్లమెంట్ స్తంభించిపోయిందని, అలాంటిది రూ.3 వేల కోట్ల మద్యం కుంభకోణంపై చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మొత్తం ఆరు అంశాలపై పార్లమెంట్లో చర్చించాలని అఖిలపక్ష సమావేశంలో కోరినట్లు ఆయన చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో మద్యం వ్యాపారంలో ఢిల్లీని మించిన కుంభకోణం జరిగిందని శ్రీకృష్ణదేవరాయలు ఆరోపించారు. ఏపీ కుంభకోణంతో పోల్చితే ఢిల్లీ స్కాం నీటిబొట్టంతే అని వ్యాఖ్యానించారు.
లిక్కర్ స్కామ్ మాస్టర్‌మైండ్ జగనే
మాజీ సీఎం జగన్ లిక్కర్ మాఫియా కోటి కుటుంబాలను నాశనం చేసిందని కాంగ్రెస్ పార్టీ ఏపీ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్ ఆరోపించారు. ఏపీలో మద్యం స్కామ్‌పై మాణికం ఠాగూర్ ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు. ‘నాసిరకం మద్యంతో రూ.3,200 కోట్లు కొల్లగొట్టారు. లిక్కర్ స్కామ్‌లో మిథున్‌రెడ్డి కేవలం పావు మాత్రమే. అసలు మాస్టర్‌మైండ్ జగన్, భారతి. లిక్కర్ స్కామ్ సొమ్మును ఎన్నికల్లో ఖర్చు చేసి ఓట్లు కొన్నారు’’ అని పేర్కొన్నారు. మరోవైపు.. మద్యం కుంభకోణం విషయంలో చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుందని జనసేన ఎంపీ బాలశౌరి అన్నారు. పార్లమెంటు సమావేశాల వేళ.. కేంద్రం నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. విభజన సమస్యలు, జల జీవన్ మిషన్, బనకచర్ల ప్రాజెక్టు గురించి పార్లమెంటులో చర్చించాలని జనసేన తరఫున ప్రస్తావించినట్లు ఆయన తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com