AP Women Commission: ఏపీలో మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలపై సమావేశం..

AP Women Commission: ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై పెరిగిపోతున్న అఘాయిత్యాలపై ఏపీ మహిళా అఖిలపక్ష సంఘం ఆధ్వర్యంలో విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. తెలుగుమహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత, కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీ, జనసేన మహిళా నేత రావి సౌజన్య, సీపీఐ నాయకురాలు దుర్గాభవాని, వివిధ మహిళా సంఘాల నేతలు రౌండ్ టేబల్ సమావేశానికి హాజరయ్యారు. గోరంట్ల మాధవ్ వీడియా కాల్ ఘటన సహా మూడేళ్లుగా ఏపీలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, లైంగిక దాడులపై జాతీయ మహిళా కమిషన్ కు లేఖ రాయాలని నిర్ణయం తీసుకున్నారు.
మహిళలపై అకృత్యాలు నిత్యకృత్యమైనా వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడాన్ని కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మహిళా మంత్రులు, మహిళా ఎంపీలకు ఫిర్యాదు చేసేందుకు మహిళా జేఏసీ సిద్ధమైంది. మహిళలపై వ్యక్తిగత దూషణలు, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై పార్టీలకు అతీతంగా పోరాడాలనీ, ట్విట్టర్ వేదికగా సంతకాల క్యాంప్ నిర్వహించాలని నిర్ణయించారు. విజయవాడలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి వచ్చిన వారితో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి బాధిత మహిళలకు అండగా నిలబడేందుకు పలు చర్యలకు శ్రీకారం చుట్టనున్నారు.
రౌండ్ టేబుల్ సమావేశం అనంతరం న్యూడ్ వీడియో అంశంపై ఫిర్యాదు చేయడానికి డీజీపీ ఆఫీస్‌కు వచ్చిన అఖిలపక్షం మహిళా నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో డీజీపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. అఖిల పక్షాల మహిళా నేతలు అక్కడే బైఠాయించి నిరసనకు దిగారు. ఎంపీ నగ్న వీడియో పై డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు వస్తే రోడ్డుపైనే అడ్డుకోవటమేంటంటూ మహిళా నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సెలవు రోజు కావటంతో ఉన్నతాధికారులెవరూ లేరని పోలీసులు నచ్చచెప్పే ప్రయత్నం చేసినా అందుబాటులో ఉన్నవారికే ఫిర్యాదు ఇచ్చి వెళ్తామని నేతలు పట్టుబట్టారు.
అయిదుగురు సభ్యుల బృందాన్ని మాత్రమే పోలీసులు లోనికి అనుమతించి పిర్యాదు తీసుకున్నారు. ఎంపీ మాధవ్ ను వెనకేసుకు రావడానికి హోం మంత్రి సిగ్గుపడాలని మహిళా నేతలు ధ్వజమెత్తారు. రాజకీయ కుట్ర అని హోం మంత్రి ఎలా చెబుతారని మండిపడ్డారు. ఎలా పని చేయాలో తెలియకుంటే ఇంట్లో కూర్చొవాలని హితవుపలికారు.
ఘటన జరిగిన ఐదు రోజుల తర్వాతబయటకొచ్చి కుట్ర అని మాట్లాడటమేంటని మండిపడ్డారు. ఎంపీ మాధవ్ వీడియోపై డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు వెళ్తే, ఎవ్వరూ అందుబాటులో లేకపోవటాన్ని మహిళా నేతలు తప్పుబట్టారు. 24 గంటలు పని చేయాల్సిన పోలీసు శాఖ సెలవు తీసుకోవటమేంటని మండిపడ్డారు. మహిళలంటే వైసీపీ నేతలకు ఎగతాళి అయిపోయిందని ఎద్దేవా చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com