AP: మండలిలో సోము వీర్రాజుపై దాడికి వైసీపీ యత్నం

ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో గురువారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సభలో జరిగిన చర్చలు ఒక్కసారిగా తీవ్ర వాగ్వాదాలకు, ఆపై తోపులాట యత్నాలకు దారి తీస్తూ కొంతసేపు హాట్ టాపిక్‌గా మారాయి. రాయలసీమ ఎత్తిపోతల పథకం అంశంపై జరిగిన చర్చ అనంతరం ఈ ఘటన చోటుచేసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానం ఇచ్చిన తర్వాత, ఆ అంశంపై మరింత చర్చ జరగాలని వైసీపీ సభ్యులు పట్టుబట్టారు. అయితే మంత్రి సమాధానం పూర్తయిందని పేర్కొంటూ మండలి ఛైర్మన్ మోషేను రాజు తదుపరి ప్రశ్నకు అవకాశం కల్పించారు. ఈ సందర్భంలో బీజేపీ ఎమ్మెల్సీ, ఫ్లోర్ లీడర్ సోము వీర్రాజు మాట్లాడేందుకు ప్రయత్నించారు. అయితే అదే సమయంలో వైసీపీ ఎమ్మెల్సీలు ఇజ్రాయెల్, విక్రాంత్, రమేష్ యాదవ్ సహా కొందరు సభ్యులు సోము వీర్రాజు వైపు దూసుకెళ్లినట్లు సమాచారం. తాము నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో మైక్ ఎలా తీసుకున్నారని ప్రశ్నిస్తూ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారడంతో సభలో గందరగోళం నెలకొంది. సోము వీర్రాజుకు మద్దతుగా మంత్రులు అనిత, గొట్టిపాటి రవికుమార్ వెళ్లి మధ్యలో నిలబడి పరిస్థితిని చల్లార్చేందుకు ప్రయత్నించారు. పెరుగుతున్న ఉద్రిక్తతను దృష్టిలో ఉంచుకుని మండలి ఛైర్మన్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు.
ఈ ఘటనపై ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. సభలో బీజేపీ ఫ్లోర్ లీడర్ సోము వీర్రాజును ఉద్దేశించి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. అవి వ్యక్తిగత దాడులకే సరిపోతాయని పేర్కొంటూ, ఆ వ్యాఖ్యలను సభా రికార్డుల నుంచి వెంటనే తొలగించాలని ఛైర్మన్‌ను కోరారు. వాస్తవాలు వినడానికి ఓపిక లేకుండా వాకౌట్ చేయడం ప్రతిపక్ష నేత బొత్సకు అలవాటైందని లోకేశ్ విమర్శించారు. సోము వీర్రాజు తన ప్రసంగంలో గత వైసీపీ ప్రభుత్వ కాలంలో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆరోపించారు. ముఖ్యంగా చిలకలూరిపేటలో జరిగిన ప్రధాని సభ నిర్వహణలో భద్రతా లోపాలు బయటపడ్డాయని, ఆ ఘటన నేపథ్యంలో అప్పటి ఎస్పీపై బదిలీ వేటు పడిందని గుర్తు చేశారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సోము వీర్రాజు ఎవరో ఒకరిని మెప్పించేందుకు మాట్లాడుతున్నారని, భజన రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. మొత్తానికి రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ప్రారంభమైన చర్చ, రాజకీయ ఆరోపణలు–ప్రత్యారోపణలకు దారి తీసి, శాసన మండలిలో ఉద్రిక్తతకు కారణమైంది. సభలో సభ్యుల మధ్య చోటుచేసుకున్న ఈ ఘటనపై వివిధ రాజకీయ వర్గాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రజాప్రతినిధులు చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించాల్సిన వేదికలో ఇలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోవడం బాధాకరమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
