AP: బడి ప్రాంగణంలోనే శవం పూడ్చిన వైసీపీ నేత

AP: బడి ప్రాంగణంలోనే శవం పూడ్చిన వైసీపీ నేత
X
వైసీపీ నేత దుశ్చర్యపై మండిపడుతున్న ప్రజలు

ప్రభుత్వ పాఠశాల ఆవరణను సమాధి స్థలంగా మార్చిన ఓ ఘటన మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలంలో కలకలం రేపింది. గానుగపెంట ఎస్సీ కాలనీలో చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో గ్రామస్థుల్లో ఆందోళన నెలకొంది. బడి పిల్లల భద్రత, మానసిక స్థితిపై ప్రభావం పడుతుందన్న హెచ్చరికలను సైతం లెక్కచేయకుండా ఒక వ్యక్తి తన తండ్రి మృతదేహాన్ని పాఠశాల ఆట స్థలంలోనే పూడ్చిపెట్టినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు కిరణ్‌ తండ్రి ఇటీవల మరణించారు. అంత్యక్రియల ఏర్పాట్ల సమయంలో మృతదేహాన్ని గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల పరిధిలో ఉన్న ఆట స్థలంలో పూడ్చాలంటూ కిరణ్‌ పట్టుబట్టినట్టు సమాచారం. పాఠశాల ఆవరణ ఇళ్ల మధ్యలో ఉండటంతో పాటు ప్రతిరోజూ విద్యార్థులు ఆటల కోసం వినియోగించే స్థలమని గుర్తుచేస్తూ గ్రామస్థులు దీనికి తీవ్రంగా అభ్యంతరం తెలిపారు. ముఖ్యంగా చిన్నారులు భయపడతారని, చదువుపై దుష్ప్రభావం పడుతుందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చిన్న వెంగయ్య కూడా అడ్డుకునే ప్రయత్నం చేసినట్టు తెలిసింది.

అయితే ఈ అభ్యంతరాలన్నింటినీ కిరణ్‌ పట్టించుకోలేదని స్థానికులు వాపోతున్నారు. తన తండ్రి శవాన్ని అక్కడే పూడ్చిపెట్టాలని పట్టుదలగా నిలబడిన ఆయన చివరకు పాఠశాల ఆట స్థలంలోనే సమాధి ఏర్పాటు చేసినట్టు చెబుతున్నారు. ఈ పరిణామంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొందరు గ్రామస్థులు దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విషయాన్ని గ్రామపంచాయతీ అధికారి రామాంజనేయరెడ్డి దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, ఆయన నుంచి తగిన స్పందన రాలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారికంగా అడ్డుకోవాల్సిన బాధ్యత ఉన్నా ఆయన చర్యలు తీసుకోలేదని, ఫలితంగా పాఠశాల స్థలం సమాధిగా మారిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తిని వ్యక్తిగత అవసరాల కోసం వినియోగించడం ఎలా సమంజసమని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు.

ఈ ఘటనపై తహసీల్దార్‌ కె.కె. కిశోర్‌కుమార్‌ స్పందించారు. పాఠశాల ఆట స్థలంలో మృతదేహం పూడ్చిన విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో శవం పూడ్చిన ప్రదేశం చుట్టూ గోడ నిర్మించి, విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలని కిరణ్‌కు సూచించినట్టు చెప్పారు. అలాగే ఈ వ్యవహారంపై పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు పంపనున్నట్టు వెల్లడించారు. ఇదిలా ఉండగా, పాఠశాల ఆవరణలో సమాధి ఉండటంతో పిల్లలు భయంతో పాఠశాలకు రావడానికి వెనుకాడతారన్న ఆందోళన తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతోంది. ప్రభుత్వ పాఠశాల స్థలాల పరిరక్షణ విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఈ సంఘటనపై అధికారుల తదుపరి నిర్ణయం ఏమిటన్నది ఆసక్తిగా మారింది.

Tags

Next Story