AP: శాసనమండలిలో హద్దు దాటిన వైసీపీ సభ్యులు

హిందువులు కలియుగ దైవంగా భావించే శ్రీ వెంకటేశ్వర స్వామి ఫొటోలను చెప్పులు, షూలు వేసుకుని శాసన మండలిలో ప్రదర్శించడం వివాదాస్పదంగా మారింది. వైసీపీ మండలి సభ్యులు ఈ విధంగా వ్యవహరించడం హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. హిందువులు కలియుగ దైవంగా ఆరాధించే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటాలతో మండలిలో జరిగిన ఘటనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్వామివారి చిత్రాలను చేతబట్టి చెప్పులు, షూలతోనే మండలిలో ప్రదర్శించడంపై ఆధ్యాత్మిక వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. హిందూ సంప్రదాయాల ప్రకారం దేవతా చిత్రాలను అత్యంత భక్తి, గౌరవాలతో చూడాల్సి ఉండగా, వాటిని ఈ విధంగా ప్రదర్శించడం అనుచితమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పవిత్రమైన వేదికగా భావించే శాసన మండలిలో ఇలాంటి ఘటన జరగడం బాధాకరమని పలువురు పేర్కొన్నారు. సంబంధిత సభ్యులపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలను గౌరవించడం ప్రతి ప్రజాప్రతినిధి బాధ్యత అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
శాసన మండలిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటాలను అవమానకరంగా విసిరేసిన ఘటనపై మంత్రి కందుల దుర్గేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని పేర్కొంటూ, దీనికి బాధ్యులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హిందువుల విశ్వాసాలకు భంగం కలిగేలా వ్యవహరించడం అసహనీయమని ఆయన అన్నారు. జగన్ హిందువులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని మంత్రి స్పష్టం చేశారు. శాసన మండలి వంటి గౌరవప్రదమైన వేదికపై శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటాలను విసిరేయడం తీవ్రమైన అవమానమని విమర్శించారు. హిందూ దేవతలను అవమానించడమే లక్ష్యంగా వైసీపీ దుష్ట రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. ఇలాంటి చర్యలను ప్రభుత్వం సహించబోదని, భవిష్యత్తులో ఎవరు దేవతలను అవమానించినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
ఏపీ శాసన మండలిలో వైసీపీ సభ్యులు చెప్పులు, బూట్లు వేసుకుని దేవుడి ఫొటోలను ప్రదర్శించడాన్ని కూటమి సభ్యులు తీవ్రంగా ఖండించారు. ఛైర్మన్ చాంబర్ వద్ద మంత్రి లోకేష్ నాయకత్వంలో ఎన్డీఏ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. వైసీపీ చేసిన చర్యపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేశ్, అనిత, గుమ్మడి సంద్యారాణి, సవిత, గొట్టిపాటి రవి, రామానాయుడు, కొల్లు రవీంద్ర తదితరులు నిరసనలో పాల్గొన్నారు. హిందూ మతాన్ని అవమానించారని ఛైర్మన్‌కు మంత్రులు తెలిపారు. ఇలాంటి చర్యను ఎలా అనుమతించారని ప్రశ్నించారు. వైసీపీ చేసినది తప్పేనని మండలి ఛైర్మన్ మోషేన్ రాజు స్పష్టం చేశారు. వైసీపీ సభ్యులను పిలిచి మాట్లాడతానని తెలిపారు. బహిరంగ క్షమాపణలు చెప్పించాలని కూటమి సభ్యులు డిమాండ్ చేశారు. చట్టసభ సాక్షిగా వైసీపీ సభ్యులు హిందువుల మనోభావాలను దెబ్బతీశారని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ధ్వజమెత్తారు. హిందూ మతాన్ని రెచ్చగొట్టేలా వైసీపీ ప్రవర్తించిందని మండిపడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
