Army Officer Saiteja : సంక్రాంతికి వస్తానని చెప్పి.. తిరిగిరాని లోకాలకు..

Army Officer Saiteja : తమిళనాడులోని కూనూరు సమీపంలో బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన బి సాయితేజ (27) కూడా ఉన్నారు. భారత ఆర్మీ అధికారులు ఆయన అకాల మరణానికి సంబంధించిన విషాద వార్తను ఆయన కుటుంబ సభ్యులకు తెలియజేశారు.
సాయితేజది చిత్తూరు జిల్లా కురబలకోట మండలం రేగడపల్లె గ్రామం... ఆయనకు భార్య శ్యామల, కొడుకు మోక్షజ్ఞ, కుమార్తె దర్శిని ఉన్నారు. సాయితేజది వ్యవసాయ కుటుంబం. ఆయన తండ్రి మోహన్.. రైతుగా పొలం పనులు చూసుకుంటాడు.. ఆయన తల్లి పేరు భువనేశ్వరి గృహిణి.. ఇక సాయితేజ సోదరుడు మహేష్ కూడా ఆర్మీలో జవాన్ గానే ఉన్నారు. ప్రస్తుతం ఆయన సిక్కింలో విధులు నిర్వహిస్తున్నారు.
సాయితేజ 2013లో ఇండియన్ ఆర్మీలో చేరారు.. బుధవారం సాయితేజ ఉదయం వీడియో కాల్‌లో తన భార్య శ్యామల, నాలుగేళ్ల అబ్బాయి, రెండేళ్ల అమ్మాయితో చివరిసారిగా మాట్లాడినట్లుగా బంధువులు తెలిపారు. ఏడాది క్రితం పిల్లల చదువుల కోసం సాయితేజ తన కుటుంబాన్ని మదనపల్లెకి మార్చారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ పర్యటనలన్నింటిలో సాయితేజ ఆయన వెంటే ఉన్నారు. ఏడు నెలల క్రితమే బిపిన్ రావత్ సాయితేజని తన పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ గా నియమించుకున్నారు.
ఇక సాయితేజ చివరిసారిగా మూడు నెలల క్రితం వినాయకచవితి పండుగ సందర్భంగా తన ఇంటికి వచ్చి తన కుటుంబంతో ఒక నెల గడిపారు. జనవరిలో వచ్చే సంక్రాంతి పండుగకు సెలవులకు దరఖాస్తు చేసుకుని ఇంటికి తిరిగి వస్తానని సాయితేజ చెప్పినట్టుగా కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా సాయితేజ మృతిపట్ల టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. సాయితేజ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com