Visakhapatnam Port : వైజాగ్ పోర్ట్ లో అగ్నివీర్ నియామక ర్యాలీలు

అగ్నివీర్ నియామక ప్రక్రియలో భాగంగా విశాఖపట్నం పోర్టు స్టేడియంలో ఇవాళ్టి నుంచి భారీ ఆర్మీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 5 వరకూ జరిగే ఈ నియామక ప్రక్రియలో వివిధ రకాల పరీక్షలు పెట్టనున్నారు.
పదో తరగతి ఉత్తీర్ణతతో అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ ఆఫీస్ అసిస్టెంట్, స్టోర్ కీపర్ టెక్నికల్ పోస్టులు, 8వ తరగతి ఉత్తీర్ణతతో అగ్నివీర్ ట్రేడ్ మ్యాన్ పోస్టుల్ని భర్తీ చేయనున్నారు. ఇప్పటికే పోర్టు స్టేడియానికి అభ్యర్థులు చేరుకున్నారు.
ముందుగా రిజిస్టర్ చేసుకొని అడ్మిట్ కార్డులు పొందిన వారికి మాత్రమే నియామక ప్రక్రియలో పాల్గొనేందుకు అవకాశం కల్పించనున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లా, తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ, ఏలూరు, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన అభ్యర్థులు ఈ ర్యాలీలో పాల్గొననున్నారు. అడ్మిట్ కార్డుల కోసం ఇండియన్ ఆర్మీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన ధృవపత్రంతో హాజరవ్వాలని అధికారులు అభ్యర్థులకు సూచించారు.
పూర్తి పారదర్శకంగా నియామక ప్రక్రియ జరుగుతుందనీ.. దళారుల్ని నమ్మవద్దని రక్షణ మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది. ఆర్మీ ర్యాలీకి సంబంధించి పోర్టు స్టేడియంలో అభ్యర్థులకు కావాల్సిన సౌకర్యాల ఏర్పాట్లను కలెక్టర్ హరేందీర ప్రసాద్, నగర పోలీస్ కమిషనర్ శంఖబత్ర బాగ్చీ పర్యవేక్షించారు. ప్రతి రోజూ 500 నుంచి 800 మంది అభ్యర్థులు ఈ ర్యాలీలో పాల్గొనే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com