బద్వేల్ ఉప ఎన్నిక కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి.. ఉదయం పది గంటలకే ఫలితం వచ్చే అవకాశం..!

Badvel By Election : కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గ ఉప ఎన్నిక కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బాలయోగి గురుకుల పాఠశాలలో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. నాలుగు హాళ్లలో 28 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు... ఆ తర్వాత ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కిస్తారు. మొత్త పది రౌండ్లలో పోలింగ్ ప్రక్రియ ముగియనుంది. ఉదయం 10 గంటల వరకే కౌంటింగ్ పూర్తయి ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉంది.
వైసీపీ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య అకాల మృతితో బద్వేల్ఉప ఎన్నిక అనివార్యమైంది. సంప్రదాయాన్ని పాటిస్తూ టీడీపీ, జనసేన పోటీకి దూరంగా ఉండగా... వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు 15మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు. వైసీపీ తరపున వెంకటసబ్బయ్య భార్య డాక్టరు దాసరి సుధ పోటీ చేయగా, బీజేపీ తరపున పనతల సురేష్, కాంగ్రెస్ తరపున మాజీ ఎమ్మెల్యే కమలమ్మ బరిలోకి దిగారు.
బద్వేల్ నియోజకవర్గంలో మొత్తం ఓట్లు 2 లక్షల15 వేల 392 ఉండగా.. లక్షా 46వేల 562 ఓట్లు పోలయ్యాయి. 2019 ఎన్నికల్లో 76.37 పోలింగ్ శాతం నమోదు కాగా.. ఈ ఉప ఎన్నికల్లో స్వల్పంగా 68.12గా నమోదైంది. సిట్టింగ్ స్థానాన్ని గెలుచుకోవడంపై వైసీపీ పూర్తి ధీమాతో ఉంది. మెజారిటీ ఎంతనేది తేలాల్సి ఉంటుందని చెబుతున్నారు. గత ఎన్నికల్లో లక్షా 58వేల ఓట్లు పోలైతే అందులో 60శాతం ఓట్లు వైసీపీకే వచ్చాయి. బీజేపీ, కాంగ్రెస్‌కు కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. ఈ సారి ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు.. టీడీపీ, జనసేన ఓట్లు కూడా తమకే వస్తాయని బీజేపీ లెక్కలు వేసుకుంటోంది. కాంగ్రెస్ పోరు నామమాత్రంకానుంది.
ఈ బైపోల్ ఫలితం పై పెద్దగా ఉత్కంఠ లేకపోయినా.. ఎవరికి ఎన్ని ఓట్లు పడతాయి..? రెండో స్థానంలో నిలిచే పార్టీ ఏది? కాంగ్రెస్ పుంజుకుంటుందా? అన్న దానిపై క్లారిటీ రానుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com