Minister Nadendla : రేషన్ అక్రమ రవాణాపై త్వరలో అరెస్టులు.. మంత్రి నాదెండ్ల వార్నింగ్

పోర్టు ద్వారా జరిగిన రేషన్ బియ్యం అక్రమ రవాణాపై త్వరలో అరెస్టులు ఉంటాయని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఉభయ గోదావరి జిల్లాల పర్యటనలో భాగంగా మంగళవారం ఆయన కాకినాడలో పర్యటించారు.
అనంతరం అధికారు లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడారు. రేషన్ బియ్యం అక్రమంగా తరలించిన వారికి త్వరలోనే 41 ఏ కింద నోటీసులు ఇచ్చి అరెస్టు చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే 6ఏ కింద నోటీసులు ఇచ్చి క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు. కాకినాడను అడ్డాగా మార్చుకుని, గత ప్రభుత్వంలో భారీగా రేషన్ బియ్యం అక్రమ రవాణా చేసినట్లు వివరించారు.
ఒక కుటుంబం కనుసన్నల్లోనే పోర్ట్ కార్యక లాపాలు నడిచాయని పేర్కొన్నారు. అనధికార కార్యకలాపాలను అరికట్టేందుకు ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. చెక్ పోస్ట్ దగ్గర ఇబ్బందులు లేకుండా అదనపు సిబ్బందిని కూడా నియమిస్తామన్నారు. అవసరమైతే మరిన్ని చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com