Asani Cyclone : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర తుఫాన్

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అసాని తీవ్ర తుఫాన్ కొనసాగుతోంది. వాయువ్య దిశగా గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం విశాఖకు ఆగ్నేయంగా 500 కిలో మీటర్ల దూరంలో తుపాన్ కేంద్రీకృతమై ఉంది. రేపు సాయంత్రం వాయువ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించనుంది.
దీంతో కోస్ట్ గార్డ్, ఎన్డీఆర్‌ఎఫ్ అధికారులు అప్రమత్తమయ్యారు. విశాఖ తీరం దగ్గర రిలీఫ్ సామాగ్రితో సహా ఐదు విపత్తు సహాయక బృందాలు, 20 మంది కోస్ట్‌గార్డ్ సిబ్బంది చేరుకున్నారు. ఇక తుపాన్ కారణంగా మూడు రోజుల పాటు కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు, ఈదురు గాలులు వీస్తాయని ప్రకటించారు.
దక్షిణ కోస్తాపై తుపాన్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని... ఈరోజు సాయంత్రం నుంచే గాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక సముద్ర తీరం అల్లకల్లోలంగా ఉండటంతో మత్య్సకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.
మచిలీపట్నం, కాకినాడ, గంగవరం సహా పోర్టులకు రెండో ప్రమాద హెచ్చరికలకు జారీ చేశారు. ఎల్లుండి ఉదయానికి ఇది ఉత్తర వాయువ్యం వైపు దిశ మార్చుకుంటుందని... ఆ తర్వాత బలహీనపడుతుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com