AP: ఆంధ్రప్రదేశ్‌లో రేపే పోలింగ్

సార్వత్రిక సమరంలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రచారపర్వానికి తెరపడింది. రేపు ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు ఈసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. 25 పార్లమెంటు నియోజకవర్గాలకు 454 మంది, 175 అసెంబ్లీ స్థానాలకు 2వేల 387 మంది అభ్యర్ధులు పోటీ పడుతుండగా 4 కోట్ల 14 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 46వేల 389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన EC మెజారిటీ నియోజకర్గాల్లో వెబ్ క్యాస్టింగ్ నిర్వహిస్తోంది. ఎలాంటి హింసకు తావులేకుండా ప్రశాంతంగా పోలింగ్ నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు EC స్పష్టం చేసింది.
సార్వత్రిక ఎన్నికలు నాలుగో విడతలో భాగంగా..ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 13న పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 25 లోక్‌సభ స్థానాలు, 175 శాసనసభ నియోజకవర్గాల్లో పోలింగ్‌కు పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఈ నెల 13 ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ నిర్వహిస్తారు. 169 నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల వరకూ, అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకూ, పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ జరగనుంది. లోక్‌సభ స్థానాలకు 454 మంది, శాసనసభ నియోజకవర్గాలకు 2వేల 387 మంది బరిలో ఉన్నారు. లోక్‌సభ స్థానాలకు సంబంధించి విశాఖలో అత్యధికంగా 33 మంది, నంద్యాల్లో 31 మంది, గుంటూరులో 30 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. అత్యల్పంగా రాజమహేంద్రవరంలో 12 మంది పోటీ చేస్తున్నారు.
శాసనసభ స్థానాల్లో అత్యధికంగా తిరుపతిలో 46 మంది, అత్యల్పంగా చోడవరంలో ఆరు గురు పోటీలో నిలిచారు.రాష్ట్రవ్యాప్తంగా 4 కోట్ల 14 లక్షల 18 వందల 87 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 46వేల 389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు EC వెల్లడించింది. వేసవి దృష్ట్యా అన్ని పోలింగ్ కేంద్రాల్లో టెంట్లు వేయటం సహా తాగునీటి సదుపాయం, ప్రాథమిక చికిత్సకు మెడికల్ కిట్లు....అందుబాటులో ఉంచనుంది. దివ్యాంగులు...., వృద్ధులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 28 చోట్ల మోడల్ పోలింగ్ కేంద్రాలను కూడా... ఏర్పాటు చేసింది. పోలింగ్ కేంద్రాల్లో విధుల కోసం 3 లక్షల 30 వేల మంది సిబ్బంది, లక్షా 14 వేల మంది పోలీసు సిబ్బంది బందోబస్తు విధుల్లో ఉంటారు. 10 వేల మంది సెక్టార్ అధికారులు,18వేల 961 మంది మైక్రో అబ్జర్వర్లు, BLOలు 46వేల 165 మంది విధుల్లో ఉంటారని EC తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా.. 34వేల 165 పోలింగ్ కేంద్రాల్లో... వెబ్ క్యాస్టింగ్ నిర్వహిస్తారు. మాచర్ల సహా 14 నియోజకవర్గాల్లో వందశాతం వెబ్‌క్యాస్టింగ్ నిర్వహించనున్నారు.ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లుచేసినట్లు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా వివరించారు. గతంలో తిరుపతి ఉపఎన్నికల సందర్భంగా వేరే ప్రాంతం వారు వచ్చి ఓట్లు వేసిన ఘటనలు జరగకుండా చూస్తామని ముకేశ్ కుమార్ స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com