Atchannaidu: ఏపీ రాజధాని హైదరాబాద్ అయితే అక్కడికే వెళ్లిపో: బొత్సపై అచ్చెన్నాయుడు ఫైర్

Atchannaidu: ఏపీ రాజధాని హైదరాబాద్ అయితే.. అక్కడికే వెళ్లిపోవాలంటూ మండిపడ్డారు ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు. 2024 వరకు ఏపీ రాజధాని హైదరాబాదేనన్న మంత్రి బొత్స కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు. విభజన తరువాత ఏపీ నుంచే పాలన సాగించాలని అమరావతికి వచ్చామన్నారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడానికి కారణాలు కూడా చెప్పుకొచ్చారు అచ్చెన్నాయుడు.
అవాస్తవాలతో కూడిన ప్రసంగం వింటే తాము తప్పు చేసిన వాళ్లం అవుతామని, అందుకే ప్రసంగాన్ని అడ్డుకున్నామన్నారు. బీఏసీలోనూ తాము లేవనెత్తిన ప్రజాసమస్యలకు ప్రభుత్వం విలువ ఇవ్వలేదని, బీఏసీలో 30 అంశాలు పెట్టినా ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితుల్లో లేదన్నారు. గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించి, పత్రాలను చించేసినందుకు సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు అచ్చెన్నాయుడు.
గవర్నర్ ప్రసంగం అడ్డుకోవడాన్ని తెలుగుదేశం సభ్యులు సమర్థించుకున్నారు. BACలో ఇదే అంశంపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వయసులో పెద్ద వ్యక్తిని అవమానించడం సరికాదు అంటూ అచ్చెన్నాయుడితో అన్నారు. గవర్నర్ ఎవరి పార్టీ కాదని, గతంలో ఇలాంటివి ఎప్పుడూ జరగలేదని అన్నారు.
అటు.. ఈ విషయంలో తమ వైఖరిని సమర్థించుకున్న టీడీపీ సభ్యులు ఏపీలో జరుగుతున్న పలు సంఘటనల విషయంలో గవర్నర్ స్పందించిన తీరును ప్రశ్నించారు. సీఆర్‌డీఏ చట్టం రద్దు, న్యాయవ్యవస్థపై దాడి, విచ్చలవిడిగా అప్పులు సహా అనేక అంశాల్లో వైసీపీ ప్రభుత్వం ఉల్లంఘనలకు పాల్పడుతుంటే గవర్నర్ ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com