Atchannaidu: ప్రభుత్వం మీద, జగన్ మీద అచ్చన్నాయుడు ఆగ్రహం

వెంటిలేటర్ మీద ఉన్న వైకాపా ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తుందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. వైకాపా పాలనలో మహిళలకు రక్షణలేకుండా పోయిందని మండిపడ్డారు. నిరుద్యోగ సమస్య, మహిళల భద్రతపై తెదేపా శాసనసభా పక్షం.. సచివాలయం అగ్నిమాపక కేంద్రం వద్ద నిరసన తెలిపింది. 'ఉపాధి లేక నిరుద్యోగుల ఆకలి కేకలు.. రక్షణ లేక మహిళల ఆర్తనాదాలు' బ్యానర్ ప్రదర్శన చేశారు. వైకాపా ప్రభుత్వం రూపంలో రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిపోతోందన్నారు. కౌరవ సభను మళ్లీ గౌరవ సభగా మారుస్తామని చెప్పారు..
అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి మొత్తం 175 స్థానాలు గెలుచుకుని క్లీన్ స్వీప్ చేస్తామన్న సీఎం జగన్‌పై సొంత పార్టీ ఎమ్మెల్యేలకే నమ్మకం లేదని టీడీపీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు అన్నారు. అసెంబ్లీ సమావేశాలు 9 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా 9.10 గంటలైనా అసెంబ్లీ హాలు ఖాళీగా ఉండడంతో ఆయన మండిపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆ పార్టీ నేత ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు.
9 గంటలకే అసెంబ్లీ జరపాలని నోటీసు ఇవ్వడంతో తాము 8.55 గంటలకే అసెంబ్లీకి వచ్చామని, కానీ 9.10 అయినా ముగ్గురు వైసీపీ శాసనసభ్యులు మాత్రమే సభలో ఉన్నారని, జగన్‌పై ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ఉండే నమ్మకం ఇదేనని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. 9.10 గంటలైనా బెల్ కొట్టలేదని పేర్కొన్నారు. లోపల ముగ్గురంటే ముగ్గురు ఎమ్మెల్యేలు ఉండడమే అందుకు కారణమని అన్నారు. దీనిని బట్టి ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద వైసీపీ శాసనసభ్యులకు ఉన్న నమ్మకం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చన్నారు.
ప్రజాస్వామ్యాన్ని నమ్మిన వ్యక్తులుగా, శాసనసభలో తమకు అవకాశం ఇవ్వకున్నా ప్రజా సమస్యలను లేవనెత్తుతామని అచ్చెన్నాయుడు తెలిపారు. తమను ఎన్ని అవమానాలకు గురిచేసినా ప్రజల గురించి శాసనసభకు వచ్చి తమ కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఐదేళ్లలో ఈ రాష్ట్రానికి ఉపయోగపడే ఒక్క చట్టాన్ని కూడా శాసనసభలో చేయలేదని మండిపడ్డారు. చేసిన చట్టాలన్నీ రాష్ట్ర వినాశనానికి దారితీసినవేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదు కోట్ల మందికి దేవాలయంలాంటి సభను ఇంత దారుణంగా తయారుచేశారని, ఇకనైనా ప్రజలు ఆలోచించాలని కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com