ఆనం వెంకటరమణారెడ్డిపై దాడి

టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డిపై దుండగులు దాడికి యత్నించారు. నెల్లూరులోని ఆర్టీఏ కార్యాలయం నుంచి బయటకు వస్తుండగా సుమారు 10మంది బైక్‌లపై వచ్చి కర్రలతో దాడికి యత్నించారు. వెంటనే టీడీపీ కార్యకర్తలు, ఆనం అనుచరులు వారిని అడ్డుకుని ప్రతిఘటించడంతో దుండగులు అక్కడికి నుంచి పరారయ్యారు. అయితే దుండగుల బైకులను ఆనం అనుచరులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో వైసీపీ ప్రభుత్వ విధానాలు, సీఎం జగన్‌తో పాటు ఇతర నాయకుల అవినీతిపై వెంకటరమణారెడ్డి ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దుండగులు దాడికి యత్నించినట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
విషయం తెలిసిన వెంటనే మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డితో పాటు పలువురు నేతలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంకటరమణారెడ్డితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆనం వెంకటరమణారెడ్డిపై దాడి యత్నాన్ని సోమిరెడ్డి తీవ్రంగా ఖండించారు. వైసీపీ నాయకులు బరితెగిస్తున్నారని మండిపడ్డారు. నెల్లూరు జిల్లాలో పట్టపగలు దాడులు చేసే కొత్త సంస్కృతికి తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి జరిగిన సమాచారం పోలీసులకు తెలియజేస్తే.. ఇద్దరు కానిస్టేబుళ్లని పంపి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. టీడీపీ నేతలపై ఇష్టానుసారంగా దాడులు జరుగుతున్న పోలీసులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
వైసీపీ దాడులకు తాను భయపడనని ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు. వైసీపీ నేతలు చేస్తున్న అవినీతి, అక్రమాలను భయటపెడుతూనే ఉంటానని.. తన గొంతు నొక్కడం ఎవరి తరం కాదన్నారు. తనపై దాడి చేసిన వారిని వదిలి పెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com