AP: వివేకా హత్యకేసు అప్రూవర్ దస్తగిరి భార్యపై దాడి

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో అప్రూవర్ దస్తగిరి భార్య షాబానపై దాడి జరిగింది. కడప జిల్లా తొండూరు మండలం మల్యాలలో ఆమెపై ఇద్దరు మహిళలు దాడి చేశారని షాబాన పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళలు తన ఇంట్లోకి చొరబడి దాడి చేయడంతో పాటు ఏడాదిలోపు దస్తగిరిని నరికేస్తామని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
దస్తగిరి భార్య సంచలన వ్యాఖ్యలు
వైఎస్ వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి భార్య షబానా పులివెందులలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తనపై ఇద్దరు మహిళలు దాడి చేశారని, దస్తగిరిని ముక్కలు ముక్కలుగా నరికి చంపుతామని బెదిరించారని పేర్కొన్నారు. దీనిపై తొండూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయగా పట్టించుకోలేదన్నారు. పులివెందుల రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామన్నారు. . జగన్, అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా నీ భర్త దస్తగిరి మాట్లాడుతాడా.. అంటూ హెచ్చరించారని షాబానా తెలిపారు. దస్తగిరిని నరికేస్తామని బెదిరించినట్లు తెలిపారు. తన భర్తను చంపాలని చూస్తున్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
దస్తగిరికి భద్రత పెంపు
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా ఉన్న దస్తగిరి భద్రత పెంచుతూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం 1+1 గన్‌మెన్‌లతో భద్రత కల్పిస్తుండగా ప్రస్తుతం 2+2 గన్‌మెన్‌లను కేటాయిస్తూ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాలు ఇచ్చారు. ఇద్దరు గన్ మెన్లు పులివెందులలో దస్తగిరి ఇంటివద్ద విధుల్లో చేరారు. వివేకా కేసులో కీలకసాక్షులు వరసగా మరణిస్తున్నారని.. తనకు భద్రత పెంచాలని పోలీసులను దస్తగిరి కోరారు. జగన్ మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డిల నుంచి ప్రాణహాని ఉందని దస్తగిరి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తనకు భద్రత పెంచాలని కోరడంతో జిల్లా ఎస్పీ నిర్ణయం తీసుకుని దస్తగిరికి భద్రత పెంచారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com