AP Teachers: ఏపీలో ప్రభుత్వ టీచర్లకు చుక్కలు చూపిస్తున్న అటెండెన్స్ యాప్..

AP Teachers: వారంలో రద్దు చేస్తామన్న సీపీఎస్ ఇప్పటికీ అతీగతీ లేదు.. డీఏ బకాయిల సంగతి చెప్పే వారే లేరు.. పీఆర్సీ ఫిట్‌మెంట్ అయితే గాల్లో కలిపేశారు.. ఇవన్నీ చాలవన్నట్టు యాప్ ఆధారిత హాజరుతో రాష్ట్ర ప్రభుత్వం తమపై కక్ష సాధిస్తోందని టీచర్లు మండిపడుతున్నారు.. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల్లో ఆందోళన పెరిగిపోతోంది. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ సిస్టమ్‌తో టీచర్లకు చుక్కలు కనబడుతున్నాయి. చాలా చోట్ల ఫేస్ రికగ్నైస్ చేయక ఫస్ట్ డేనే తీవ్ర ఇబ్బందులు పడ్డారు టీచర్లు.
ఒక్క నిమిషం ఆలస్యమైనా హాఫ్ డే లీవ్ లేదా ఫుల్ డే లీవ్‌గా పరిగణిస్తామని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది.. అయితే, అటెండెన్స్ యాప్‌ను వినియోగించగా క్యాప్చా ఎర్రర్ అని చూపిస్తున్న పరిస్థితి కొన్ని చోట్ల కనబడుతోంది.. ఎలాంటి శిక్షణ లేకుండా కొత్త పద్ధితిలో హాజరు నమోదు చేయాల్సి రావటంతో తొలిరోజు ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో హాజరు కోసం.. ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉదయం నుంచే కుస్తీలు పడ్డారు. ఉదయం ఎనిమిదిన్నర నుంచి సెల్‌ఫోన్‌లో హాజరు నమోదుకు ప్రయత్నాలు ప్రారంభించినా.. సరైన సమయంలో చాలా మంది అటెండెన్స్ వేయలేకపోయారు.
హైస్కూల్‌లో 24 మంది టీచర్లు ఉండగా.. తొలిరోజు ఉదయం తొమ్మిదింటిలోపు కేవలం ఇద్దరే అటెండెన్స్ పూర్తి చేశారు. యాప్‌లో అడుగుతున్న ముఖ కవళికలు, కళ్లు ఆర్పటం, నవ్వటం, తలతిప్పకోకుండా ఉండటం ఎన్నిచేసినా హాజరు పడలేదన్నారు. అటు చిత్తూరు జిల్లా కుప్పంలోని ప్రభుత్వ పాఠశాలలోని 18 మంది టీచర్లలో ఇద్దరికే ఆన్‌లైన్ హాజరు నమోదైంది. ఉదయం నుంచి ప్రయత్నాలు చేసినా సర్వర్ బీజీ, టైమ్ అవుట్ అంటూ వస్తోందని ఉపాధ్యాయులు వాపోయారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా ఆబ్సెంట్ నమోదుపై ఆందోళన వ్యక్తం చేశారు.
మొదట్లో బయో మెట్రిక్ విధానంలో హాజరు నమోదు చేసేవారు.. దాంట్లో ఐదు నుంచి పది నిమిషాలు ఆలస్యమైనా అటెండెన్స్ పడేది.. కానీ, సిమ్స్ ఏపీ యాప్‌లో ఒక్క నిమిషం ఆలస్యమైనా అటెండెన్స్ తీసుకోవడం లేదు.. దీంతో ఆ రోజు టీచర్ డ్యూటీకి రానట్టుగానే అధికారులు పరిగణిస్తారు.. ఉన్న కష్టాలు చాలక ఇదేం తలనొప్పి అంటూ టీచర్లు ఆందోళన పడుతున్నారు. ఈ విధానంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.. ట్రాఫిక్ కష్టాలను తట్టుకుని స్కూల్‌కు చేరుకుంటే నిమిషం ఆలస్యమైనా సీఎల్ మార్క్ వేస్తామంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.
స్మార్ట్ ఫోన్ ఉపయోగించడం తెలియని వారు, స్మార్ట్ ఫోన్లు లేని వారు చాలా మంది వున్నారని.. కనీసం శిక్షణ కూడా ఇవ్వకుండా ఇదేం టార్చర్ అని ఫైరవుతున్నారు. ఏజెన్సీ ఏరియాల్లో ఉన్న వారి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. డిమాండ్ల సాధన కోసం ఉద్యమించడమే పాపం అన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం తమపై కక్ష కట్టిందని అంటున్నారు. తాము ఉద్యమం చేపట్టినప్పటి నుంచి అన్ని రకాలుగా వేధిస్తోందంటున్నారు. ఇప్పటికైనా ఆన్‌లైన్ అటెండెన్స్ విధానాన్ని సవరించాలని ఉపాధ్యాయులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. యాప్‌ల బాధ తప్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com