వాగులో పడిన ఆటో.. ఒకరు మృతి, అయిదుగురు గల్లంతు

వాగులో పడిన ఆటో.. ఒకరు మృతి, అయిదుగురు గల్లంతు
గల్లంతైన వారికోసం గాలింపు ముమ్మరం చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో 12 మంది ప్రయాణికులు ఉన్నారు.

నెల్లూరు జిల్లాలో ఘోర ఆటో ప్రమాదం చోటుచేసుకుంది. నిన్నరాత్రి సంగానికి మూడు కిలో మీటర్ల దూరంలో నెల్లూరు-ముంబయి జాతీయ రహదారిపై ఆటో బీరాపేరు వాగులో పడింది. ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈప్రమాదంలో ఒకరు మృతిచెందారు. ఐదుగురు గల్లంతయ్యారు. గల్లంతైన వారికోసం గాలింపు ముమ్మరంచేశారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో 12 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో ఏడుగురు బయటపడగా.. ఒక బాలిక మృతిచెందింది. మరో ఐదుగురి కోసం గాలింపు కొనసాగుతోంది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు.

ఆత్మకూరు జ్యోతినగర్‌కు చెందిన కె.నాగేంద్ర ఇటీవల మరణించాడు. దీంతో అతని కుటుంబసభ్యులు సంగమేశ్వరాలయంలో నిద్ర చేసేందుకు ఆటోలో బయలుదేరారు. బీరాపేరు వాగు వంతెన పైకి చేరుకోగానే.. ఎదురుగా వచ్చిన రెండు లారీలు ఒకదానికొకటి అధిగమించే క్రమంలో ఆటోను ఒక లారీ ఢీకొట్టింది. దాంతో ఆటో 25 అడుగుల దిగువనున్న వాగులో పడిపోయింది. ఆటోలో ఉన్న నాగసాయి,నందు అనే యువకులు నీటిలో ఈదుకుంటూ గట్టుకు చేరారు.

సంగం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది నాగవల్లి, నవదీప్, లక్ష్మిదేవి, నాగభూషణం, కృష్ణకుమారీలను రక్షించి ఆత్మకూరు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నాగవల్లి అనే 12ఏళ్ల బాలిక మరణించింది. సంపూర్ణమ్మ, పుల్లయ్య, నాగరాజు, పద్మ, ఆదెమ్మలు వాగులో గల్లంతయ్యారు. సంగం ఎస్సై నాగార్జున తన సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టారు.

గల్లంతైనవారికోసం గజ ఈతగాళ్లతో వాగులో గాలింపుచేపట్టారు. మరోవైపు అగ్నిపమాపక సిబ్బంది పడవలతో వాగులో జల్లెడ పడుతున్నారు. స్థానికులు, బాధితుల బంధువులు వాగువద్దకు భారీగా చేరుకున్నారు. గల్లంతైనవారు ప్రాణాలతో ఉన్నారా లేదా అనేది ఉత్కంఠగా మారింది. బాధితుల బంధువులు రోదనలతో ఆప్రాంతంలో విషాద చాయలు అలుముకున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story