BABU SUPPORT: ఈ నైపుణ్యం... బాబు గారి పుణ్యం

స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో తెలుగుదేశ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును రిమాండ్ తరలించడం ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర కలకలం రేపుతోంది. ప్రభుత్వ కక్ష సాధింపును ప్రజలంతా ముక్త కంఠంతో ఖండిస్తున్న వేళ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌తో లబ్ధి పొందిన వారు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. చంద్రబాబుకు మద్దతుగా గళం విప్పుతున్నారు. తమకు ప్రయోజనం చేకూర్చి... తమ పిల్లలకు బంగారు భవిష్యత్తును అందించి... తమ కోసం కటకటాలపాలైన మహానీయుడు చంద్రబాబుకు అండగా ఉంటామని ప్రకటిస్తున్నారు. తమ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించి వారి నైపుణ్యాలు అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ ప్రారంభించారని ఆనాటి రోజులను గుర్తు చేసుకుంటున్నారు. అందులో శిక్షణ పొందే నేడు తమ పిల్లలు ఉన్నత స్థానాలకు చేరారని స్పష్టం చేస్తున్నారు. చంద్రబాబునాయుడు గారిపై పడిన అపనిందను తొలగించేందుకు తన కూతుళ్లకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందో చెప్తే తిరిగి కట్టేస్తానంటూ ఆ తండ్రి పోస్ట్‌లో స్పష్టం చేశాడు.
స్కిల్ డెవలప్‌మెంట్‌లో శిక్షణ పొందిన తమ ఇద్దరు పిల్లలు ఉన్నత స్థానంలో ఉన్నారని... చంద్రబాబు ఖర్చు పెట్టిన 370 కోట్ల రూపాయల నుంచే తమ కుమార్తెలు శిక్షణ తీసుకున్నారని ఓ తండ్రి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. . ఆ సొమ్మును నారా చంద్రబాబునాయుడు దోచుకుని ఉంటే తన కుమార్తెలకు ట్రైనింగ్ ఎవరి డబ్బుతో ఇచ్చారంటూ ఆ తండ్రి ప్రభుత్వాన్ని, సీఐడీ అధికారులను ప్రశ్నిస్తున్నాడు.
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ సొమ్మును చంద్రబాబు నాయుడు గారు దోచుకుని ఉంటే తన కుమార్తెల శిక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా అయిన ఖర్చు ఎంతో చెబితే తాను తిరిగి కడతానంటూ ఆ తండ్రి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. చంద్రబాబు పెట్టిన దయతో తన కూతుళ్లు ఇప్పుడు ఉద్యోగాలు సాధించారని, చాలామంది విద్యార్థులు స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ ద్వారా శిక్షణ పొంది క్యాంపస్ ఇంటర్వ్యూలలో సెలెక్ట్ అయి మంచి జీతాలతో ఉద్యోగాలు చేయగలిగే స్థితికి చేరారని పోస్ట్‌లో వివరించాడు.
చంద్రబాబునాయుడు దోచుకున్నారంటున్న మొత్తం నుంచి తాను కట్టే సొమ్మును మినహాయించాలని ఆ తండ్రి పోస్ట్‌లో వివరించారు. తన కుమార్తెల లాంటి వారికి ట్రైనింగ్ ఇప్పించి, ఉన్నత ఉద్యోగం వచ్చేలా చేసిన ఆ మహానుభావుడికి, తన కుమార్తెల లాంటి వారి భవిష్యత్తు కోసం ఖర్చు పెట్టిన సొమ్మును దోచుకున్నాడనే మచ్చ రావడం తనకు, తన భార్యకు చాలా బాధ కలిగిస్తోందని అబ్బూరి శ్రీనివాసులు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు.
బీ టెక్ చదివేటప్పుడు తన పెద్ద కుమార్తె, తర్వాత తన నా చిన్న కుమార్తె శిక్షణ తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ట్రైనింగ్ పూర్తయ్యాక 2017 ఏప్రిల్‌లో అమరావతికి వెళ్లి అప్పటి మంత్రి కొల్లు రవీంద్ర, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసిన ఫోటోను కూడా పోస్ట్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com