Nandamuri Balakrishna : టీడీఎల్పీ కార్యాలయంలో సందడి చేసిన బాలయ్య బాబు... సరదాగా వ్యాఖ్యలతో నవ్వులు..

హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ తన సరదా వ్యాఖ్యలతో అసెంబ్లీలో నవ్వులు పూయించారు. మంగళవారం జరిగిన ఈ ఆసక్తికర సంఘటన టీడీఎల్పీ కార్యాలయంలో అందరినీ ఆకట్టుకుంది.
శాసనసభ సమావేశాల విరామ సమయంలో బాలకృష్ణ టీడీఎల్పీ కార్యాలయానికి వచ్చినప్పుడు, పలువురు మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయనతో ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపించారు. ఈ క్రమంలో, తొలిసారిగా అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ, బాలకృష్ణను ఉద్దేశించి "నన్ను ఆశీర్వదించండి అంకుల్" అని కోరారు. దీనికి బాలకృష్ణ వెంటనే నవ్వుతూ, తనదైన శైలిలో "నో అంకుల్.. ఓన్లీ బాలయ్య" అని చమత్కరించారు. దీంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా గట్టిగా నవ్వేశారు. ఈ సరదా సంభాషణతో టీడీఎల్పీ కార్యాలయం కాసేపు సందడిగా మారింది.
ఇక 'అఖండ-2' సినిమా గురించి తోటి నేతలు బాలయ్య బాబు ను ప్రశ్నించగా... డిసెంబర్ 5 న విడుదల కానున్నట్లు చెప్పారు. "ఈ నెల 25న నా తమ్ముడు పవన్ కల్యాణ్ సినిమా విడుదలవుతోంది. ఆ సినిమా గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని బాలకృష్ణ అన్నారు. కాగా మంత్రి సంధ్యారాణి అరకు కాఫీకి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించి ప్రచారం కల్పించాలని బాలకృష్ణను కోరారు. ఆమె విజ్ఞప్తికి ఆయన సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఈ మొత్తం సంఘటనలతో అసెంబ్లీలో బాలకృష్ణ తనదైన శైలిలో అందరినీ అలరించారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com