AP: జగన్‌పై బాలినేని సంచలన వ్యాఖ్యలు

AP: జగన్‌పై బాలినేని సంచలన వ్యాఖ్యలు
X
ఏకపక్ష నిర్ణయాల వల్లే వైసీపీని వీడినట్లు ప్రకటన... రాజకీయాలు కొత్త కాదన్నా సామినేని

వైసీపీని వీడి జనసేన పార్టీలో చేరిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి.. వైఎస్ జగన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. జగన్ తీసుకునే ఏకపక్ష నిర్ణయాలవల్లే వైసీపీని వీడానని బాలినేని తెలిపారు. తనలాంటి సీనియర్లను జగన్ అస్సలు పట్టించుకునేవారు కాదని అన్నారు. జనసేన అధినేత ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు బాలినేని స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లాలో జనసేనను ప్రజల్లోకి తీసుకెళతామని బాలినేని వెల్లడించారు. తాను వైసీపీలో ఉన్నా కూడా పవన్ తన గురించి మంచిగా చెప్పేవారని బాలినేని గుర్తు చేసుకున్నారు. తన మీద పవన్‌కు ఉన్న నమ్మకానికి ధన్యవాదాలని బాలినేని తెలిపారు. తన చేరిక ద్వారా కూటమిలో విభేదాలు వస్తాయని జరిగే ప్రచారంలో వాస్తవం లేదన్న బాలినేని...తమ అధినేత ఏది చెబితే అదే చేస్తానన్నారు. కూటమిలోని ఇతర పార్టీల‌ నేతలను కలుపుకుని వెళతామన్నారు. కొన్ని అసత్య ప్రచారాలు, చిన్న వివాదాలు సర్దుకుంటాయని బాలినేని వెల్లడించారు. ప్రకాశం జిల్లాలో జనసేనను ప్రజల్లోకి తీసుకెళతామన్నారు.

జగన్‌వి ఏకపక్ష నిర్ణయాలే

తాను వైయస్సార్‌కు వీరాభిమానని తెలిపిన బాలినేని.. ఆయన అడుగుజాడల్లో పని చేశానన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏక పక్ష నిర్ణయాలు తమ మనసుకు కష్టం కలిగించాయని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు పదవులు ముఖ్యం కాదన్నారు. విలువ, గౌరవం ముఖ్యమని తేల్చి చెప్పారు. రెండోసారి మంత్రి వర్గ విస్తరణలో అందరనీ మారుస్తామని చెప్పిన జగన్‌... తమ లాంటి కొంతమందిని మార్చి మమ్మల్ని అవమానించారని బాలినేని అన్నారు. జగన్మోహన్ రెడ్డి చర్యలు చాలా సందర్బాలలో తనను బాధించాయన్న ఆయన.. తమ అధినేత పవన్ కల్యాణ్ అడుగు జాడల్లో నడుస్తానని తెలిపారు.

సేవ చేసేందుకే..

మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను సైతం జనసేన పార్టీలో చేరారు. పార్టీకి, ప్రజలకు సేవలు అందించడంలో ముందుంటానని చెప్పారు. కూటమి పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయన్నారు. ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతానని చెప్పారు. ఎలాంటి షరతులు లేకుండా తాను జనసేనలో చేరానని సామినేని తెలిపారు. తనకు రాజకీయాలు కొత్తేమీ కాదని.. అందరితో కలిసి వెళతానని చెప్పారు.

Tags

Next Story