BC WAR: బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ హైడ్రామా

తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అమలుకు అఖిలపక్షంతో ప్రధాని నరేంద్ర మోడీ ని కలవాలనుకున్న అపాయింట్ ఇవ్వలేదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. తెలంగాణ బీజేపీ నేతలు అపాయింట్మెంట్ ఇప్పిస్తే ప్రధానికి కలుస్తామని తెలిపారు. కానీ, బీసీ రిజర్వేషన్లను బీజేపీ అడ్డుకుంటుందని, నేటి బంద్ ఆ పార్టీకి వ్యతిరేకంగా జరగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేసిన ఆరోపణలపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఓట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్లపై డ్రామాలు ఆడుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైన 10 మంది బీసీ బిడ్డలకు మంత్రులుగా అవకాశం ఇవ్వాలన్నారు. స్థానిక ఎన్నికలు నిర్వహించే ఉద్దేశం కాంగ్రెస్ కి లేనే లేదన్నారు.
బీసీ రిజర్వేషన్లపై సంచలన వ్యాఖ్యలు
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లు నిలిచేది కాదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం.. జీవోలు విడుదల చేయడం వల్ల ప్రయోజనం ఉండదని అభిప్రాయపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకొని చట్టబద్ధతను కల్పించడం ద్వారానే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు అవుతాయని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరుతో బీసీల ఆశలపై నీళ్లు పోసినట్లు అయ్యిందన్నారు. బీసీ బంద్ కు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు.
కల్వకుంట్ల కవిత హాట్ కామెంట్స్
బీసీల బంద్‌కు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మద్దతు ఇచ్చారు. ఈ క్రమంలో కాంగ్రెస్, బీజేపీపై విరుచుకుపడ్డారు. బీసీల రిజర్వేషన్ల పెంపుపై మాట్లాడేందుకు ఆ రెండు పార్టీలకు అర్హత లేదన్నారు. తెలంగాణ అసెంబ్లీ, కౌన్సిల్ పాస్ చేసిన బిల్లులను ఆమోదించకుండా నెలల తరబడి పెండింగ్‌లో పెట్టిన బీజేపీ ఇప్పుడు బంద్‌లో పాల్గొనటం ఏంటని క్వశ్చన్ చేశారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి బీసీలను వంచిస్తున్నాయన్నారు. బీసీ రిజర్వేషన్లు అమలయ్యే వరకూ తమ పోరాటం ఆగదని అన్నారు.
"బీజేపీని బద్నాం చేయాలని చూస్తుండ్రు"
స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ సర్కార్ బీసీలను, ప్రజలకు దగా చేస్తోందని బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్ర ఆరోపణలు చేశారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి అసలు చిత్తశుద్ధే లేదని అన్నారు. అసలు ప్రభుత్వ విధానమే సరిగ్గా లేదని.. బీసీ రిజర్వేషన్లపై ఇచ్చిన జీవో కోర్టులో నిలబడదని తాను అప్పుడే చెప్పానని కామెంట్ చేశారు. బీసీలను, ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం దగా చేస్తోందని ఫైర్ అయ్యారు. బీసీ రిజర్వేషన్లపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అందరూ ఊహించినదేనని అన్నారు. స్థానిక ఎన్నికల్లో లబ్ధి కోసమే ఈ డ్రామాలకు తెర లేపారని తీవ్ర ఆరోపణలు చేశారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీని బద్నాం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని కామెంట్ చేశారు. అసెంబ్లీలో బీసీ బిల్లుకు తాము ఆమోదం తెలిపింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లకు బీజేపీ అడ్డు పడుతోందని కాంగ్రెస్ విమర్శిస్తోందని డీకే అరుణ అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com