BHOGI: వైభవంగా సంక్రాంతి సంబరాలు

BHOGI: వైభవంగా సంక్రాంతి సంబరాలు
పల్లెల్లో పండుగ వాతావరణం... అడుగడుగున ఉట్టిపడుతున్న పండుగ శోభ

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబురాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దూర ప్రాంతాల్లో ఉన్నవారు సొంతూళ్లకు చేరుకోవడంతో... పల్లెల్లో పండుగ వాతావరణం ఉట్టిపడుతోంది. ఎటు చూసినా రంగురంగుల ముత్యాల ముగ్గులే దర్శనమిస్తున్నాయి. లోగిళ్లు బంధువులతో కళకళలాడుతున్నాయి. కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి. సంక్రాంతి సందర్భంగా రాష్ట్రప్రజలకు పలువురు ప్రముఖులు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి అంటేనే సందడి. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ఈ మూడురోజులు సందడి వాతావరణం నెలకొంటుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి పండుగ శోభ కనిపిస్తోంది. హనుమకొండ జిల్లా పరకాలలో వివిధ పాఠశాలలు, కళాశాలలో సంక్రాంతి పండుగ వేడుకలు ముందుగానే నిర్వహించారు. కొందరు వినూత్న రీతిలో ఆలోచించి తమ అభిప్రాయాలను ముగ్గుల రూపంలో వేశారు. రమాదేవి అనే మహిళ.. ఆడపిల్లలకు ఉన్న ప్రాధాన్యాన్ని వివరిస్తూ తన మనసులోని భావాలను ముగ్గురూపంలో వ్యక్తపరిచారు.

తెలుగు ప్రజలందరికీ భాజపా రాష్ర్ట అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సుఖశాంతుల సంక్రాంతి.. అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. రాష్ట్రప్రజలకు మాజీమంత్రి హరీశ్‌రావు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగిమంటలు ప్రజల జీవితాల్లో చీకట్లు పారదోలాలని ప్రార్థించారు. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదన్న ఆయన... అయోధ్యలో అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో భాగస్వాములమయ్యే అవకాశం సిద్దిపేటవాసులకు దక్కడం పూర్వజన్మ సుకృతమని వెల్లడించారు. ఈ నేపథ్యంలో అయోధ్యలో అన్నప్రసాద వితరణ కోసం సరుకులతో వెళ్లే వాహనాలను ఆయన ప్రారంభించారు.

వేములవాడ అర్బన్ మండలం రుద్రవరంలో... సంక్రాంతి సందర్భంగా ఏటా నిర్వహించే తెప్పల పోటీలను.. ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ప్రారంభించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో జరుగుతున్న శ్రీ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలకు.. సంక్రాంతి సందర్భంగా ఈ మూడు రోజులు భక్తులు అధికసంఖ్యలో తరలిరానున్నారు. పండుగను పురస్కరించుకుని ఆలయ ఆవరణలో నిర్వహించిన చిందు యక్షగాన ప్రదర్శన వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. మంచిర్యాల జిల్లా మందమర్రి వేంకటేశ్వరస్వామి ఆలయంలో గోదా రంగనాథ స్వామి కళ్యాణం వైభవంగా జరిగింది. దేవతామూర్తులను దర్శించుకునేందుకు పెద్దఎత్తున భక్తులు రాగా... ఆలయ ప్రాంగణం గోవింద నామస్మరణతో మార్మోగింది. నిర్మల్‌లో ధనుర్మాసం ఉత్సవాల్లో భాగంగా గోదాదేవి కళ్యాణం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మంత్రోచ్ఛారణలు మంగళవాద్యాల నడుమ వేడుక కనులపండువగా సాగింది.

Tags

Read MoreRead Less
Next Story