ycp: ఉప ఎన్నిక వేళ వైసీపీకి బిగ్ షాక్

కడప జిల్లాలో రెండు జడ్పీటీసీ స్థానాలకు జరుగుతోన్న ఉప ఎన్నిక ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది. ఓవైపు పులివెందుల, మరో వైపు ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో గెలిచేసేందుకు అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఇటు కూటమి పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.. అయితే, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల వేళ వైసీపీకి షాక్ తగిలినట్టు అయ్యింది.. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒంటిమిట్ట ఎంపీపీ అక్కి లక్ష్మి దేవి, ఉప మండలాధ్యక్షురాలు గీతా.. తెలుగుదేశం పార్టీలో చేరారు.. వీరితోపాటు పలువురు వైసీపీ నాయకులు టీడీపీలో చేరగా, వారికి మంత్రి రాంప్రసాద్‌రెడ్డి.. టీడీపీ కండువాలు కప్పి.. పార్టీలోకి ఆహ్వానించారు.. విద్యావంతులు టీడీపీలోకి స్వచ్ఛందంగా వచ్చి చేరడం ఆనందంగా ఉందన్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి.. ఆయనతో పాటు జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ రాజు, టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు.. అనంతరం గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి సత్తా చాటాలని వైసీపీ- టీడీపీ బలంగా భావిస్తున్నాయి. దీంతో పులివెందులలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
కడప జిల్లా పులివెందులలో తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు తగలబెట్టారు. పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికల సందర్భంగా పలుచోట్ల రహదారికి ఇరువైపులా టీడీపీ ప్లెక్సీలను ఏర్పాటు చేసింది. నాలుగు రోజుల నుంచి ఈ ప్రాంతంలో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఈక్రమంలో పులివెందుల మండలం కొత్తపల్లి రోడ్డు పక్కన కట్టిన ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు తగలబెట్టారు. టీడీపీ నేత బీటెక్ రవి, అభ్యర్థి లతారెడ్డితో పాటు జిల్లా నాయకుల పోస్టర్లతో వెలసిన ఫ్లెక్సీలను కాల్చివేశారు. ఈ ఘటనపై టీడీపీ శ్రేణులు పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలని కోరాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com