BILL GATES: వ్యవసాయ రంగంలో ఆంధ్రప్రదేశ్ సర్కార్ సేవలు భేష్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో అమలు చేస్తున్న సాంకేతిక పరిజ్ఞానం, కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత యాప్ సేవలను గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్ గేట్స్ ప్రశంసించారు. రైతులకు డిజిటల్ విధానంలో అందుతున్న సేవలు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. రైతు రిజిస్ట్రేషన్ నుంచి వివిధ ప్రభుత్వ సేవలను పొందే వరకు యాప్‌లో జరిగే మొత్తం ప్రక్రియను ఒక మహిళా రైతు వివరించగా, బిల్ గేట్స్ ఆసక్తిగా వినడం విశేషం. వ్యవసాయంలో సాంకేతిక వినియోగం ఎలా మార్పు తీసుకువస్తుందో ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపారు. డ్రోన్ సాంకేతికతను ఉపయోగించి అరటితోటలో రసాయన పిచికారీ చేసిన విధానాన్ని ఆయన ప్రత్యక్షంగా వీక్షించి అభినందించారు. ఈ సందర్భంగా సోమవారం మధ్యాహ్నం సచివాలయం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ఉండవల్లిలోని వ్యవసాయ క్షేత్రాన్ని ఆయన సందర్శించారు. రాష్ట్రంలో రైతుల్లో సాంకేతిక వినియోగాన్ని పెంచేందుకు చేపట్టిన కార్యక్రమాల గురించి వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు వివరించారు.
ప్రజల జీవితాల్లో ఆర్టీజీఎస్ మార్పు తెస్తోంది:చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో సాంకేతిక ఆధారిత పరిపాలన ద్వారా ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తీసుకురావడమే తమ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. పరిపాలనా వ్యవస్థలో వేగం, పారదర్శకత, వ్యాపార సౌలభ్యం పెంపునకు ఆర్టీజీఎస్ కీలకంగా పనిచేస్తోందని తెలిపారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు త్వరితగతిన అందించడంలో ఆర్టీజీఎస్ సాంకేతిక వేదిక ప్రభావవంతంగా మారిందన్నారు. ఈ విషయాలను ఆయన ఎక్స్ వేదికగా పంచుకున్నారు. 1990లో బిల్ గేట్స్ ను కలిసిన సందర్భాన్ని సీఎం గుర్తుచేశారు. ఆ సమయంలో సాంకేతికత ద్వారా పౌరసాధికారత సాధ్యమనే ఆలోచన తనకు బలంగా కలిగిందని పేర్కొన్నారు. అదే దిశగా ఆలోచనలు అభివృద్ధి చెందుతూ నేటి టెక్నాలజీ ఆధారిత పరిపాలనకు పునాది వేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆర్టీజీఎస్ ద్వారా అమలు చేస్తున్న పలు కార్యక్రమాల ప్రదర్శన సంతోషాన్నిచ్చిందని పేర్కొన్నారు. డేటా ఆధారిత నిర్ణయాలు, తక్షణ స్పందన, సేవల మానిటరింగ్ వంటి అంశాల్లో రాష్ట్రం ముందంజలో ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక గేట్స్ ఫౌండేషన్‌తో రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న భాగస్వామ్యంపై ఉపముఖ్యమంత్రి పవన్ సానుకూలంగా స్పందించారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం వంటి కీలక రంగాల బలోపేతానికి గేట్స్ ఫౌండేషన్ సహకారం అందించడం ఆనందకరమని తెలిపారు.
సంజీవని ప్రాజెక్టు వెరీ నైస్ : గేట్స్
గేట్స్ ఫౌండేషన్ సహకారంతో కుప్పం, చిత్తూరు జిల్లాలో నడుస్తున్న సంజీవని ప్రాజెక్టు అమలును గేట్స్ అత్యంత ఆసక్తిగా పరిశీలించారు. బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్ లాంటి వైద్య పరీక్షల అనంతరం ఏం చర్యలు చేపడుతున్నారని అడిగి తెలుసుకున్నారు. ఎవరైనా ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటే వారికి ఎలాంటి సేవలు అందుతున్నాయని గేట్స్ ఆరా తీశారు. కుప్పంలో అమలు చేస్తున్న సంజీవని డిజిటల్ హెల్త్ రికార్డుల ప్రాజెక్టు చక్కగా ఉందని కితాబు ఇస్తూ... దట్స్ వెరీ నైస్ అంటూ గేట్స్ వ్యాఖ్యానించారు. ప్రజల డిజిటల్ హెల్త్ రికార్డులను అనుసరించి వారి లైఫ్ స్టైల్ మార్పు, ఆహారం తీసుకునే అంశాల్లో సలహాలు ఇస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు. ఏఐ వినియోగం ద్వారా ప్రాథమికంగా వారి సందేహాలను తీర్చేలా వైద్య సేవలను అందించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. దీనిపై స్పందించిన బిల్ గేట్స్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగించి వైద్య సేవలు అందించే విధానం చాలా బాగుందని ప్రశంసించారు. భారత్ బయోడిజైన్ ద్వారా భవిష్యత్తులో వైద్య సేవలు అందించే విధానాన్ని గేట్స్ అడిగి తెలుసుకున్నారు.అమరావతి నిర్మాణాలపై ఇచ్చిన ప్రజంటేషన్ను రాజధాని నిర్మాణం జరుగుతున్న తీరును గేట్స్‌కు సీఎం చంద్రబాబు వివరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
