డీజీపీ కార్యాలయం ముట్టడికి బీజేపీ పిలుపు.. నేతలను అరెస్ట్ చేసిన పోలీస్

ఏపీలో దేవాలయాలపై దాడులకు బీజేపీ కూడా కారణమంటూ డీజీపీ కామెంట్ చేయడంపై మండిపడుతున్నారు కమలనాథులు. డీజీపీ కామెంట్లకు నిరసనగా డీజీపీ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చింది బీజేపీ. దీంతో బీజేపీ నాయకులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. మంగళగిరి హైవేపై దూసుకొచ్చిన నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కొందరు నేతలను గృహనిర్బంధంలో ఉంచారు. డీజీపీ ఆఫీస్ ముట్టడికి బయల్దేరుతున్న కన్నా లక్ష్మీ నారాయణను పోలీసులు ఆయన ఇంట్లోనే నిర్బంధించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని, అందుకు నిదర్శనమే ఈ గృహనిర్బంధాలు అంటూ విమర్శించారు కన్నా లక్ష్మీ నారాయణ. ప్రభుత్వ అండదండలతోనే విగ్రహాల ధ్వంసం జరుగుతోందని విమర్శించారు.
ఏడాదిన్నర కాలంగా రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతుంటే.. ప్రభుత్వం సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రభుత్వాన్ని తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చూడలేదని మండిపడ్డారు కన్నా లక్ష్మీనారాయణ. ఒకప్పుడు ఏపీలో పోలీసు వ్యవస్థ ఆదర్శంగా ఉండేదని, కాని వైసీపీ నేతలు చెప్పినట్లు నడుచుకోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. ప్రభుత్వ చేతగాని తనానికి మంత్రుల దూషణలే నిదర్శనమని చెప్పుకొచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com