Borugadda Anil: వైసీపీ నేతలు ఆదేశిస్తే తిట్టా

వైసీపీ పాలనలో సామాజిక మాధ్యమాల వేదికగా ప్రతిపక్ష నేతలు, మహిళలపై ఇష్టారీతిన అసభ్యపదజాలంతో రెచ్చిపోయిన రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌కుమార్‌కు కోర్టు 13 రోజుల రిమాండ్ విధించింది. 2021లో ఓ వ్యక్తిని బెదిరించి 50 లక్షల డిమాండ్ చేశాడంటూ అరండల్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో అనిల్‌ను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు 13 రోజుల రిమాండ్ విధించడంతో అతడ్ని రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. వైసీపీ పాలనలో నోటికొచ్చినట్లు దూషించడం, అరాచకాలు, అక్రమాలకు పాల్పడిన అనిల్.. ఎన్నికల ఫలితాల తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పోలీసులు అనిల్‌ను అరెస్ట్ చేశారు.
వైసీపీ నేతలు రెచ్చగొట్టడం వల్లే..
వైసీపీ నాయకులు రెచ్చగొట్టి, ప్రతిపక్షాలను తిట్టాలని ఆదేశించడం వల్లే ఆనాడు దూషించాల్సి వచ్చిందని పోలీస్ అధికారుల వద్ద రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌కుమార్ మొరపెట్టుకున్నట్లు తెలిసింది. వైసీపీ హయాంలో ఎందుకు అక్రమాలకు పాల్పడ్డావు? నాటి ప్రతిపక్ష నాయకులను, మహిళలను ఎందుకు అసభ్య పదజాలంతో దూషించావు? ఎన్నికల ఫలితాల తర్వాత ఎక్కడికెళ్లావు? ఎవరు ఆశ్రయం ఇచ్చారంటూ అతనిపై గుంటూరు పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. ‘నీవు దళితుడివి...నీకు పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుంది.. టీడీపీని తిడితే మేం అండగా ఉంటాం...’ అని నాడు ప్రోత్సహించిన వారు.. నేడు ఒక్కడు కూడా పరామర్శకు రాలేదని బోరుగడ్డ అనిల్ పోలీసుల వాపోయినట్టు తెలిసింది. ‘‘ఆ రోజు అలా తిట్టడం తప్పే.. ఎవరినైతే సోషల్ మీడియాలో తిట్టానో వారందరి కాళ్లు పట్టుకొని క్షమాపణ కోరుతాను. అప్రూవర్‌గా మారతాను’’ అని వేడుకొన్నట్టు తెలిసింది. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ప్రతిపక్ష పార్టీల ముఖ్యనేతల నుంచి క్షేత్రస్థాయి నాయకులు, కార్యకర్తలు, మహిళల వరకు.. అందరినీ అసభ్య పదజాలంతో బోరుగడ్డ అనిల్ కుమార్ దూషించాడు.
దాచుకోకుండా సమాధానాలు
పోలీసు అధికారులు ఏది అడిగినా అనిల్ దాచుకోకుండా సమాధానమిచ్చారు. ‘‘నాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చగొట్టేలా మాట్లాడారు. దానికితోడు వైసీపీ నాయకులు.. నన్ను ముందుకు నెట్టి తాము వెనుక ఉన్నారు. నాటి మంత్రి మోపిదేవి వెంకటరమణ, ఆయన సోదరుడితో పాటు గుంటూరు నగర వైసీపీ అధ్యక్షుడు అప్పిరెడ్డి ఆదేశానుసారమే నాటి విపక్ష నేతలను దూషించాను. బెదిరింపులకు పాల్పడ్డాను’’ అని తెలిపారు. ఇన్నాళ్లు ఢిల్లీలో కేంద్రమంత్రి రాందాస్ అథావాలే వద్ద ఉన్నానని, తన తల్లికి సర్జరీ చేయించడం కోసం గుంటూరుకు వచ్చానని అనిల్ పేర్కొన్నారు. రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ ఆగడాలపై బాధితులు ఎవరైనా ఆధారాలతో ఫిర్యాదు చేేస్త కేసులు నమోదు చేస్తామని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. 2018లో అనంతపురం టౌన్‌లో ఐఏఎస్ అధికారినని చెప్పి మోసం చేసిన కేసులో అనిల్ జైలుకెళ్లారు. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ అనిల్ రెచ్చిపోవడం మొదలుపెట్టారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో దూషించేవారు. ఆయనపై ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 17 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని ఎస్పీ వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com