Borugadda: వైసీపీ పెద్దల్లో బోరుగడ్డ టెన్షన్

వైసీపీ పాలనలో ఎన్నో అరాచకాలకు పాల్పడి, ఎట్టకేలకు అరెస్టయిన బోరుగడ్డ అనిల్... కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. . జగన్ మెప్పు పొందేందుకు నోటికి అడ్డూ అదుపూ లేకుండా మాట్లాడాడు. ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను సైతం టార్గెట్ చేసి విమర్శలు చేసిన సందర్భాలున్నాయి. తమ నేత జగన్ ఆదేశిస్తే చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ను చంపుతానని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. దీనిపై పోలీసుల విచారణలో బోరుగడ్డ అనిల్ కీలక విషయాలు బయటపెట్టినట్టు తెలుస్తోంది. విచారణలో బోరుగడ్డ వైసీపీ పెద్దల పేర్లు చెప్పినట్టు విశ్వసనీయంగా తెలిసింది. వైసీపీలో అన్నీ తానై వ్యవహరించిన ముఖ్య నేతతోపాటు కేంద్ర కార్యాలయంలో ఉంటూ గుంటూరులో చక్రం తిప్పిన మరో నేత పేరు అనిల్ చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు అనిల్‌కుమార్ ఇంట్లో తనిఖీలు చేసిన పోలీసులు కొన్ని పత్రాలతోపాటు సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. డేటా రికవరీ కోసం వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపనున్నారు. అనిల్‌కుమార్ ఎవరెవరి పేర్లు చెప్పారనే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏ ఘటనలో ఎవరి పేర్లు చెబుతారోనని వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు.
రాజమండ్రి జైలుకు..
బోరుగడ్డను తొలుత నెల్లూరు జైలుకు పంపాలని న్యాయస్థానం ఆదేశించింది. అక్కడ తనకు ఇబ్బంది ఉంటుందని విన్నవించడంతో రాజమహేంద్రవరం జైలుకు పంపారు. గురువారం అర్ధరాత్రి ఆయన అక్కడికి చేరుకున్నారు. పవన్ కల్యాణ్‌ను దూషించిన కేసు అరండల్‌పేట ఠాణాలో నమోదైంది. ఈ కేసులోనూ కస్టడీకి పోలీసులు కోరనున్నారు. విజయపురి కాలనీకి చెందిన ఓ వ్యక్తిని చంపుతానని బెదిరించినందుకు అనిల్‌కుమార్‌పై పట్టాభిపురం ఠాణాలో మరో కేసు నమోదైంది. ఈ కేసులోనూ కస్టడీకి కోరనున్నారు. గుంటూరు జిల్లాతోపాటు అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల్లోనూ పలు కేసులు ఉండటంతో అనిల్‌కుమార్‌ను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును ఆశ్రయించనున్నారు. ఈ నేపథ్యంలో ఒక కేసు తర్వాత మరో కేసులో వరుసగా విచారించే అవకాశముంది.
ఆర్‌పీఐతో సంబంధం లేదు
బోరుగడ్డ అనిల్‌కుమార్‌కు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్‌పీఐ)తో ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి పేరం శివనాగేశ్వరరావు తెలిపారు. ఆర్‌పీఐ ఏపీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడినని చెప్పుకొంటున్న ఆయన్ని ఏడాది కిందటే తాము సస్పెండ్ చేశామన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com