Anantapur: తెల్లవారితే పెళ్లి..! ఇంతలోనే సినిమా రేంజ్ ట్విస్ట్..

Anantapur: తెల్లవారితే పెళ్లి! అంతా సందడిగా ఉంది. ఇంతలో పోలీసుల నుంచి పెళ్లికొడుక్కి ఫోన్‌కాల్. నీ కోసం ఓ అమ్మాయి వచ్చింది అర్జెంట్‌గా పోలీస్ స్టేషన్‌కు రావాలంటూ హుకుం. దీంతో పోలీ స్టేషన్‌కు పరుగులు తీశాడు వరుడు. ఇంట్లో తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని.. ప్రియురాలినే పెళ్లి చేసుకుంటానని తెగేసి చెప్పాడు. ఇంతలో వధువు తల్లిదండ్రులు స్టేషన్‌కు వచ్చి వరుడిపై ఫిర్యాదు చేశారు. ఈ ఘటన అనంతపురం జిల్లా గుత్తి మండలంలో జరిగింది.
ఇసురాళ్లపల్లికి చెందిన రమేష్‌కు పెద్దవడుగూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతితో పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. శుభలేఖలు కొట్టించి.. ఊరూవాడా పంచేశారు. ఇవాళ పెళ్లి జరగాల్సి ఉంది. అయితే నిన్న రాత్రి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన ఓ యువతి.. రమేష్ తనను ప్రేమించి మరో యువతిని పెళ్లి చేసుకుంటున్నాడంటూ గుత్తి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
వరుడి వివరాలు తీసుకున్న పోలీసులు.. రమేష్‌కు ఫోన్ చేసి విషయం చెప్పారు. పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న రమేష్ తనకు పెద్దల కుదిర్చిన పెళ్లి ఇష్టం లేదని స్పష్టం చేశాడు. ప్రియురాలినే పెళ్లి చేసుకుంటానన్నాడు. ఈ విషయం తెలుసుకుని వధువు తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు.
పెళ్లికి సిద్ధమై చివరి క్షణంలో ఇలా చేస్తే తమ బిడ్డ పరిస్థితి ఏంటని వరుడి కుటుంబ సభ్యులపై మండిపడ్డారు. తమను మోసగించిన వరుడు, అతని తల్లిదండ్రులు, అన్న, వదినపై ఫిర్యాదు చేశారు. పోలీసులు ఐదుగురిపై కేసు నమోదు చేశారు. మొత్తానికి..పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుడు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు. ఇవాళ జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com