TTD Chairman : టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడు ప్రమాణ స్వీకారం

TTD Chairman : టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడు ప్రమాణ స్వీకారం
X

తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త పాలకమండలి ఛైర్మన్‌ గా బొల్లినేని రాజగోపాల్ నాయుడు ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. 17 మంది సభ్యులు కూడా ప్రమాణం చేశారు. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలిలో బీఆర్ నాయుడు చేత ఈవో శ్యామలరావు ప్రమాణ స్వీకారం చేయించారు. టీటీడీ పాలకమండలి సభ్యులుగా పలువురు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. టీటీడీ నూతన పాలకమండలి కొత్త అధ్యక్షుడు బీఆర్‌ నాయుడు, 17 మంది సభ్యులు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో వారు బాధ్యతలు స్వీకరించారు. ఎక్స్‌ అఫిషియో సభ్యుడిగా ఎండోమెంట్‌ కమిషనర్‌ సత్యనారాయణ కూడా బాధ్యతలు స్వీకరించారు. తొలుత చైర్మన్‌, అనంతరం సభ్యులు ప్రమాణ స్వీకార పత్రాలపై సంతకాలు చేశారు. అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో వారికి శేషవస్త్రాలు కప్పి వేద ఆశీర్వచనం చేశారు. నూతన బోర్డులో టీడీపీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు సభ్యులుగా నియమితులయ్యారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజుకు చోటు దక్కింది. మాజీ కేంద్రమంత్రి పనబాక లక్ష్మితో పాటు భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ ఎండీ సుచిత్ర ఎల్లా కూడా కొత్త పాలకమండలిలో ఉన్నారు. రాజమహేంద్రవరం సమీపంలోని రఘుదేవపురానికి చెందిన అక్కిన మునికోటేశ్వరరావు, నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్‌ గౌడ్‌, పల్నాడు జిల్లాకు చెందిన జంగా కృష్ణమూర్తి, కుప్పం క్లస్టర్‌ ఇన్‌చార్జి వైద్యం శాంతారాం, మంగళగిరికి చెందిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకీదేవి, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి కూడా సభ్యులుగా నియమితులయ్యారు. జనసేన నుంచి పవన్‌కల్యాణ్‌ సన్నిహితుడు, తెలంగాణ జనసేన ఉపాధ్యక్షుడు బొంగునూరి మహేందర్‌రెడ్డి, సినీ ఆర్ట్‌ డైరెక్టర్‌, పవన్‌కల్యాణ్‌ స్నేహితుడు బూరగాపు ఆనంద్‌సాయి, జనసేన పార్టీ వ్యవస్థాపక సభ్యురాలు అనుగోలు రంగశ్రీకి కొత్త బోర్డులో చోటు లభించింది. అలాగే ఫార్మా రంగంలో ఉన్న నాట్కో గ్రూప్‌ వైస్‌ చైర్మన్‌ సన్నపనేని సదాశివరావు, ఎన్‌ఆర్‌ఐ జాస్తి పూర్ణసాంబశివరావు, కర్ణాటక పారిశ్రామికవేత్తలు నరే్‌షకుమార్‌, కాఫీ రంగంలో ప్రముఖుడైన ఆర్‌ఎన్‌ దర్శన్‌, సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి హెచ్‌ఎల్‌ దత్‌ సభ్యులుగా నియమితులయ్యారు. తాజా బోర్డులో మరోసారి సభ్యులుగా ప్రమాణస్వీకారం చేసినవారిలో కృష్ణమూర్తి వైద్యనాథన్‌, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, జంగా కృష్ణమూర్తి, సౌరభ్‌ బోరా, సుచిత్ర ఎల్లా ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలోనూ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, జంగా కృష్ణమూర్తి సభ్యులుగా ఉన్నారు. కేంద్ర హోం మంత్రికి సన్నిహితుడుగా పేరున్న చెన్నైకు చెందిన కృష్ణమూర్తి వైద్యనాథన్‌ 2015 నుంచి వరుసగా(ఐదుసార్లు) టీటీడీ బోర్డులో కొనసాగుతున్నారు.

Tags

Next Story