అమ్మా చదవలేకపోతున్నా.. బీటెక్ విద్యార్థి భవనంపై నుంచి దూకి..

అమ్మా చదవలేకపోతున్నా.. బీటెక్ విద్యార్థి భవనంపై నుంచి దూకి..
ఉన్న ఒక్కడినీ తీసుకెళ్లి హాస్టల్లో ఉంచి బీటెక్ చదివిస్తున్నారు. కానీ అతడికి చదువు భారమైంది..

ఒక్కగానొక్క కొడుకు. బాగా చదువుకొని తమ కంటే పై స్థాయిలో ఉండాలని కోరుకున్నారు. ఉన్న ఒక్కడినీ తీసుకెళ్లి హాస్టల్లో ఉంచి బీటెక్ చదివిస్తున్నారు. కానీ అతడికి చదువు భారమైంది.. చనిపోతున్నానంటూ లేఖ రాసి ఈ లోకంనుంచి శాశ్వతంగా నిష్క్రమించాడు.. అమ్మానాన్నకు కడుపుకోత మిగిల్చాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టిస్తోంది.

కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలుకు చెందిన వడ్డెల్లి గోపాలరావు, తులసి దంపతులకు తిరుమలేశ్ ఒక్కగానొక్క సంతానం. తల్లి అక్కడే ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా పని చేస్తుంటే, తండ్రి మరో స్కూల్లో ఆఫీస్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. ఒక్కగానొక్క కొడుకుని అల్లారు ముద్దుగా పెంచారు. పై చదువులు చదివించాలని కలలుకన్నారు. ఏలూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్ చదివిస్తున్నారు.

లాక్‌డౌన్ సమయంలో ఇంటికొచ్చి అమ్మానాన్నతో ఉన్నాడు. తిరిగి కాలేజీలు తెరుచుకోవడంతో ఏలూరుకు వెళ్లాడు. సోమవారం సెల్ఫీ వీడియో తీసుకుని తల్లిదండ్రులకు, మిత్రులకు పంపించి కళాశాల భవనం పై నుంచి దూకేశాడు. అమ్మానాన్న మీరు నిండు రూరేళ్లు జీవించండి అంటూ తాను మాత్రం అర్థాంతరంగా తనువు చాలించాడు. కొన ఊపిరితో ఉన్న తిరుమలేశ్‌ను కళాశాల సిబ్బంది గమనించి హుటాహుటిన విజయవాడ తరలించినప్పటికీ అతడి ప్రాణాలు కాపాడలేకపోయారు.

కొడుకు అభివృద్ధిని కోరుకున్నామే కానీ.. చదువే తనని ఇబ్బంది పెడుతుందని తెలుసుకోలేకపోయామని అమ్మానాన్న కన్నీరు మున్నీరవుతున్నారు. కొడుకును పోగొట్టుకున్న వేదనలోనూ గుండె దిటవు చేసుకొని అతడి కళ్లను ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి దానం చేశారు. ఏదో ఒక రూపంలో తమ బిడ్డ ఈలోకంలో బతికే ఉన్నాడన్న సంతృప్తి తమకు మిగిలి ఉండాలని ఆశించారు.

Tags

Next Story