FLOODS: కొల్లేరుకు బుడమేరు వరద.. రాకపోకలు బంద్‌

FLOODS: కొల్లేరుకు బుడమేరు వరద.. రాకపోకలు బంద్‌
X
ఆరు రోజులుగా నిలిచిపోయిన రాకపోకలు.. దయనీయంగా కొల్లేరు గ్రామాల పరిస్థితి

బుడమేరు ఉగ్రరూపం దాల్చింది. బుడలేరు వరదకు దాదాపు 20 డ్రెయిన్ ల నుంచి వచ్చే వర్షం నీరు తోడు కావడంతో కొల్లేరు సరస్సులో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే ఏలూరు రూరల్ పరిధిలోని గుడివాకలంక, పత్తికోళ్లంక, మొండికోడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోగా.. మండవల్లి గ్రామంలో పెనుమాకలంక, మణుగూరు వంటి 9 గ్రామాలకు రాకపోకలు బంద్‌ అయ్యాయి.. ఏలూరు- కైకలూరు రహదారిపై ఆరు రోజుల నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. వరద ప్రవాహం కొనసాగడంతో కొల్లేరు గ్రామాల పరిస్థితి దయనీయంగా మారుతుంది.

ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో కొల్లేరులో నీటిమట్టం క్రమంగా పెరుగుతండడంతో.. స్థానికులతో పాటు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. మరోవైపు.. కొల్లేరు సరస్సు పరివాహక ప్రాంతాల్లోని ఆక్వా రైతుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. బుడమేరు తీసుకొచ్చిన వరకు ఇప్పటికే వేలాది ఎకరాల్లో చెరువులు ముంపు బారిన పడగా మరిన్ని చెరువులకు ముంపు భయం పొంచి ఉంది. ఒక్కో అంగుళం నీటి మట్టం పెరగుతుంటే కొల్లేరు లంక ప్రాంతాల్లోని ఆక్వా రైతులు హడలిపోతున్నారు. విజయవాడను ముంచెత్తిన బుడమేరు వరద ఇప్పుడు కొల్లేరు రైతులకు అపార నష్టం తెచ్చిపెడుతోంది తెగిపోయిన బుడమేరు గండ్ల పూడ్చడంతో.. ఆ వరద మొత్తం ఇప్పుడు కొల్లేరుకు చేరుతుంది..

వేల ఎకరాల్లో పంట నష్టం

ఉత్తరాంధ్రలో కురిసిన భారీ వర్షాలకు వేలాది ఎకరాల్లో పంట నష్టం సంభవించింది. అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో 3,508 హెక్టార్లు, శ్రీకాకుళంలో 1,223 హెక్టార్లు, విజయనగరంలో వెయ్యి ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న పంటలు నీట మునిగాయి. శ్రీకాకుళం జిల్లాలో వర్షాలకు 38 ఇళ్లు దెబ్బతిన్నాయి. 17 చెరువులకు గండ్లు పడగా, 8 మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. విజయనగరం సర్కిల్‌ పరిధిలో విద్యుత్‌ స్తంభాలు కూలిపోవడంతో రూ. 21 లక్షల నష్టం వాటిల్లింది. జిల్లాలో రాష్ట్ర హైవే 68 కి.మీ, ఆర్‌అండ్‌బీ రోడ్లు 67 కి.మీ దెబ్బతినగా, మరమ్మతులకు రూ. 4 కోట్లు, శాశ్వత పనులకు రూ. 12 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో రాష్ట్ర రహదారులు 55 కి.మీ, ఆర్‌అండ్‌బీ రహదారులు 108 కిలోమీటర్ల మేర దెబ్బతిన్నాయి.




Tags

Next Story