Andhra Pradesh: ఏపీ అప్పులు, ఆర్థిక వ్యవహారాలపై కాగ్ ప్రత్యేక దృష్టి..
Andhra Pradesh: ఏపీ అప్పులు, ఆర్థిక వ్యవహారాలపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ మరింత దృష్టి పెట్టింది. ఏపీ ఆర్థిక వ్యవహారశైలిపై పదే పదే వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఢిల్లీ నుంచి నేరుగా తన డిప్యూటీ ఆఫీసర్ శ్రీనివాసన్‌ను పంపింది కాగ్. ఆయన ఇటీవల ఏపీ చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి సత్యనారాయణతో సమావేశమైనట్లు తెలుస్తోంది.
మరోవైపు కాగ్‌లో అంతర్భాగమైన ఏపీ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఆఫీసు కోరిన పూర్తి సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పంపలేదు. దీంతో గత ఆర్థిక సంవత్సరం లెక్కలే ఇంకా తేలలేదు. వివిధ కార్పొరేషన్ల పేరుతో రుణాలు తెచ్చి రాష్ట్ర ప్రణాళిక కింద నిధులు వెచ్చిస్తున్నందున ఆ వివరాలు, పీడీ లెక్కల ఖాతాలు నివేదించాలని పీఏజీ ఆఫీసు లేఖలు రాసింది.
ప్రతి నెలా రాష్ట్ర ఆదాయ,వ్యయాలు, అప్పులు తదితర అంశాలను కాగ్ ఆఫీసు పరిశీలించి నివేదికలు విడుదల చేస్తుంది. ఈ లెక్కలనే కేంద్రం పరిగణలోకి తీసుకుంటుంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రెండు నెలలు గడిచినప్పటికీ ఇంకా పాతలెక్కలనే క్లియర్ చేయలేదు ఏపీ సర్కార్. బడ్జెట్‌లో చూపకుండా రుణాలు తీసుకువచ్చి రాష్ట్ర ప్రణాళిక కింద ఖర్చు చేస్తున్న సమస్త వివరాలు ఇవ్వాలని పీఏజీ పట్టుబడుతోంది.
మే నెలాఖరులోగా సమాచారం పంపాలని, ఇది అత్యవసరంగా పరిగణించాలని సూచించింది. కార్పొరేషన్లకు గ్యారంటీలిచ్చి తీసుకువచ్చిన రుణాలు, వాటి ఖర్చుల వివరాలు తెలియజేయాలని ప్రభుత్వాన్ని కోరింది. APSDC నుంచి వేల కోట్ల రుణం తీసుకువచ్చి సంక్షేమ పథకాలకు మళ్లించారు. ఇదే తరహాలో బేవరేజస్ కార్పొరేషన్, రాష్ట్ర ఫైనాన్షియల్ సర్వీసు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌ల నుంచి కూడా రుణాలు తీసుకున్నారు.
మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి కోరినంత అప్పు దక్కలేదు. ఆర్థిక సంఘం నిబంధనల ప్రకారం.. ఇతరత్రా అన్ని రుణాలు కలిపి 61 వేల కోట్ల వరకు రుణాలకు అనుమతించాలని ఏపీ కోరింది. ఐతే కేంద్రం 28 వేల కోట్లకే పర్మిషన్ ఇచ్చింది. ఇప్పుడు కాగ్ మార్చి నెలాఖరు వరకు పై అన్ని వివరాలతో లెక్కలు ఖరారు చేస్తే మొత్తం రుణం ఎంత తీసుకున్నారో అధికారికంగా తేలుతుంది
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com