Nandigama : గణేశ్ మండపం వద్ద చికెన్ బిర్యానీ.. వైసీపీ నాయకులపై కేసు నమోదు

Nandigama : గణేశ్ మండపం వద్ద చికెన్ బిర్యానీ.. వైసీపీ నాయకులపై కేసు నమోదు
X

నందిగామలో మాజీ సీఎం వై.ఎస్. రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా వైసీపీ నాయకులు గణేశ్ మండపం పక్కన చికెన్ బిర్యానీతో భోజనాలు ఏర్పాటు చేయటం వివాదాస్పదమైంది. మంగళవారం జరిగిన ఈ ఘటనపై భక్తులు, ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక గాంధీ సెంటర్‌లో గత నెల 27 నుంచి వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్న ఈ ప్రాంతంలోనే వైసీపీ నాయకులు ఈ కార్యక్రమం చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత గణేశ్ మండపం పక్కనే చికెన్ బిర్యానీతో భోజనాలు వడ్డించారు.

ఈ చర్యపై స్థానిక భక్తులు అభ్యంతరం వ్యక్తం చేయగా, పోలీసులు కూడా జోక్యం చేసుకున్నారు. సీఐ వైవీవీఎల్ నాయుడు అనుమతి లేకుండా కార్యక్రమం నిర్వహించడం, పవిత్రమైన గణేశ్ మండపం వద్ద మాంసాహార భోజనాలు పెట్టడం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినప్పటికీ పార్టీ నాయకులు దానిని ఖాతరు చేయలేదు. దీంతో పోలీసులు వెంటనే స్పందించి, వాటర్ క్యాన్లు, ఇతర సామగ్రిని అక్కడి నుంచి తరలించారు.

ఈ ఘటనపై పోలీసులు మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్‌తో పాటు మరో 20 మందిపై కేసు నమోదు చేశారు. పవిత్రమైన వినాయక చవితి ఉత్సవాల సమయంలో ఇలాంటి చర్యలు చేపట్టడంపై నందిగామలో తీవ్ర చర్చ జరుగుతోంది.

Tags

Next Story