JAGAN: జగన్‌పై కేసు నమోదు

గుంటూరు మిర్చి యార్డ్ పర్యటన నేపథ్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు మరో 8 మంది వైసీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా వైసీపీ నేతలు యార్డులో పర్యటించారని పోలీసులు తెలిపారు. లేళ్ల అప్పిరెడ్డి, కొడాలి నాని, నందిగం సురేశ్, అంబటి రాంబాబు, పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిలపై కేసులు నమోదయ్యాయి. మరోవైపు కొన్ని రోజుల నుంచి జగన్ మాట్లాడుతున్న భాష కూటమి పార్టీలకి అనుకూలంగా మారుతుందనే టాక్ వినిపిస్తోంది. రెండు రోజుల క్రితం జైల్లో ఉన్న వంశీని కలిసిన అనంతరం మీడియాతో జగన్ మాట్లాడుతూ.. తప్పు చేసిన అధికారుల బట్టలూడదీస్తామంటూ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఉద్యోగులపై అలా నోరు జారడంతో వచ్చే ఎన్నికల్లో వారే వైసీపీ వ్యతిరేకంగా మారి.. కూటమికి అనుకూలంగా మారుతారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
నేడు గవర్నర్‌ను కలవనున్న వైసీపీ నేతలు
వైసీపీ నేతలు నేడు గవర్నర్ ను కలవనున్నారు. గుంటూరు మిర్చి యార్డు పర్యటనలో వైఎస్ జగన్‌కు భద్రతపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌కు పార్టీ నేతలు ఫిర్యాదు చేయనున్నారు. మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, వెలంపల్లి శ్రీనివాసరావు, నాగార్జున, అంబటి రాంబాబు, లేళ్ళ అప్పిరెడ్డి తదితరులు గవర్నర్‌ను కలవనున్నారు.
నేడు పాలకొండకు జగన్
పార్వతీపురం మన్యం జిల్లాలో నేడు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లి నుంచి బయల్దేరి మధ్యాహ్నం 2 గంటలకు పాలకొండకు చేరుకుంటారు. ఇటీవల మృతి చెందిన వైసీపీ నేత పాలవలస రాజశేఖరం కుటుంబాన్ని జగన్ పరామర్శించనున్నారు. ఆయన కుమారుడు, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌కు ధైర్యం చెప్పనున్నారు.
జగన్ ముద్దాడిన పాప.. ఢిల్లీ స్కూల్ విద్యార్థట..!
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పర్యటనలో జగన్ కోసం ఏడ్చిన పాప వీడియో బాగా వైరల్ అయింది. ఆ పాపను జగన్ దగ్గరకు తీసుకుని ముద్దాడారు కూడా. అయితే ఆ పాప తనకు తల్లికి వందనం రాలేదని తర్వాత మీడియాతో వెల్లడించింది. దీంతో ఆ పాప వివరాలు ఇవేనంటూ నెట్టింట ఓ పోస్ట్ దర్శనమిస్తోంది. ఆ పాప ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతోందని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. దీనిని కొందరు వైరల్ చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com