Gudivada Casino : గుడివాడ క్యాసినో వ్యవహారంపై కేసు నమోదు

గుడివాడ క్యాసినో వ్యవహారంపై.. రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు పోలీసులు. ఇప్పటికే ఈ ఘటనపై నూజివీడు డీఎస్పీ విచారణ జరుపుతున్నారు. ఇప్పుడు ఎఫ్‌ఐఆర్ నమోదు కావడంతో... దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. సంక్రాంతి టైమ్‌లో కోడి పందాలను మించి గుడివాడ క్యాసినో ఏపీలో మారుమోగింది. గోవా, శ్రీలంకల్ని మించిన స్థాయిలో దీన్ని ఏర్పాటు చేశారు. మందు నుంచి మగువ వరకు.. రమ్మీ నుంచి మూడు ముక్కల వరకు.. జూదంలో ఎన్ని రకాలున్నాయో అన్నింటినీ ఈ క్యాసినో ఏర్పాటు చేశారనే ప్రచారం జరిగింది. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
ఈ క్యాసినోలో ఏకంగా 500కోట్ల మేర పందేలు జరిగాయంటేనే ఏ స్థాయిలో ఏర్పాట్లు చేసి, ఎంత మందికి ఆహ్వానాలు పంపారో అర్థం చేసుకోవచ్చు. వైసీపీ రంగుల్ని పోలిన గుడారాల్లో ఎంత అరాచకం జరగాలో అంతా జరిగిందనే మాట స్థానికంగా చాలా బలంగా వినిపించింది. ఎవరూ వీడియోలు చిత్రీకరించకుండా బౌన్సర్లను కూడా పెట్టినా కొందరు చాటుగా షూట్ చేయడంతో ఈ తతంగమంతా బయటకు వచ్చింది.
గుడివాడ క్యాసినోపై తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో కృష్ణా పోలీసులు కదిలారు. క్యాసినో వ్యవహారంపై విచారణకు ఆదేశించారు ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్. ఇందుకోసం ప్రత్యేక విచారణ అధికారిగా నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులును నియమించారు. సంక్రాంతి 4 రోజులు ఏం జరిగింది అనే దానిపై ఇప్పటికే గుడివాడ డీఎస్పీతో మాట్లాడిన ఎస్పీ.. ఇప్పుడు విచారణ బాధ్యతలు నూజివీడు డీఎస్పీకి అప్పగించారు.గోవా నుంచి క్యాసీనో టీమ్‌ను రప్పించింది ఎవరనే దానిపై దర్యాప్తు జరుగుతోంది. ఇప్పుడు తాజాగా దీనిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com