CAT: ఏపీకి వెళ్లాల్సిందే.. ఐఏఎస్‌లకు క్యాట్‌ ఆదేశం

CAT: ఏపీకి వెళ్లాల్సిందే.. ఐఏఎస్‌లకు క్యాట్‌ ఆదేశం
X
డీవోపీటీ ఆదేశాలపై మధ్యంతర ఉత్తర్వులకు క్యాట్‌ నో.. నేడు ఏపీ సీఎస్ ముందు ఐఏఎస్ ల రిపోర్ట్

తెలంగాణ కేడర్‌ నుంచి ఏపీకి కేటాయించిన ఐఏఎస్‌ అధికారులకు చుక్కెదురైంది. పలువురు ఐఏఎస్‌ అధికారులను ఏపీకి కేటాయిస్తూ డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలను సవాల్‌ చేస్తూ ఐఏఎస్‌లు ఆమ్రపాలి, వాణిప్రసాద్‌, వాకాటి కరుణ, సృజన కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాలంటూ కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ ఐఏఎస్‌ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌ను క్యాట్ తోసిపుచ్చింది. ఎక్కడికి కేటాయించిన వాళ్లు అక్కడే రిపోర్ట్ చేయాలని క్యాట్ ఆదేశించింది. ప్రజా హితాన్ని పరిగణనలోకి తీసుకునే ఈ నిర్ణయానికి వచ్చినట్లు స్పష్టం చేసింది. దీంతో తెలంగాణలో పనిచేస్తున్న వాకాటి కరుణ, ఆమ్రపాలి, వాణీప్రసాద్, రొనాల్డ్‌రాస్‌ నేడు ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి ముందు రిపోర్టే చేయనున్నారు.


ఆదేశాలు పాటించాల్సిందే..

ఐఏఎస్‌ల కేటాయింపు నిర్ణయాధికారం డీవోపీటీకే ఉందని న్యాయవాదులు క్యాట్‌కు తెలిపారు. వన్‌మెన్‌ కమిటీ సిఫారసును డీవోపీటీ ఎలా అమలు చేస్తుందని ప్రశ్నించారు. డీవోపీటీ వన్‌మెన్‌ కమిటీ ఇచ్చిన నివేదికను ఐఏఎస్‌లకు ఇవ్వలేదని.. ఐదుగురు ఐఏఎస్‌లకు కమిటీ నివేదికను చూపలేదన్నారు. కమిటీ నివేదిక ఇవ్వకుండానే డీవోపీటీ ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. క్యాట్‌ స్పందిస్తూ.. వరదలతో ఏపీ ప్రజలు ఇబ్బందులుపడుతున్నారని.. వరద ప్రాంతాలకు వెళ్లి సేవ చేయాలని లేదా? అని ప్రశ్నించింది. వన్‌మెన్‌ కమిటీని డీవోపీటీ వేసినప్పుడు ఎందుకు స్పందించలేని.. అసలు నివాసానికి అర్థం ఏంటో చెప్పాలని.. కోర్టు ధిక్కరణ పిటిషన్‌ ఎందుకు దాఖలు చేయలేదంటూ ప్రశ్నిస్తూ.. ఆదేశాలపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. బుధవారం యధావిథిగా ఐఏఎస్‌ అధికారులంతా రిపోర్ట్‌ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. డీవోపీటీ ఆదేశాలను పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. నేరుగా నిర్ణయం తీసుకోకుండా వన్‌మెన్‌ కమిటీని నియమించిందని తెలిపారు. వన్‌మెన్‌ కమిటీ రిపోర్టును సమర్పించాలని సూచించింది. తర్వాత విచారణను నవంబర్‌కు వాయిదా వేసింది.

క్యాట్ తీర్పుపై ఐఏఎస్‌ల సంచలన నిర్ణయం

డీవోపీటీ ఆదేశాలను పాటిస్తూ ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాల్సిందే అంటూ క్యాట్ ఇచ్చిన తీర్పును ఐఏఎస్‌లు హైకోర్టులో సవాల్ చేయనున్నారు. క్యాట్‌ ఉత్తర్వుల నేపథ్యంలో తెలంగాణ నుంచి రిలీవ్‌ కానున్న అధికారుల జాబితాలో ఆమ్రపాలి కాట, రొనాల్డ్‌ రోస్‌, వాకాటి కరుణ, వాణిప్రసాద్‌, సృజన, హరికిరణ్‌, శివశంకర్‌ ఉన్నారు. క్యాట్‌లో ఊరట దక్కకపోవడంతో అధికారులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారు. క్యాట్ ఆదేశాల అనంతరం ఐఏఎస్‌ల లాయర్లు దీనిపై స్పష్టత ఇచ్చారు. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేస్తామని వెల్లడించారు. మరోవైపు క్యాట్ ఆదేశాలతో అయిదుగురు ఐఏఎస్‌లకు ప్రభుత్వం రిలీవింగ్ ఉత్తర్వులు ఇచ్చింది.

Tags

Next Story