CBI: వైఎస్ వివేకా కేసులో మళ్లీ రంగంలోకి దిగిన సీబీఐ

CBI: వైఎస్ వివేకా కేసులో మళ్లీ రంగంలోకి దిగిన సీబీఐ
X
ప్రధాన నిందితుల బంధువులకు సీబీఐ నోటీసులు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు మరోసారి కీలక మలుపు తిరిగింది. రెండేళ్ల విరామం తర్వాత సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) మళ్లీ వేగం పెంచింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణను మరింత లోతుగా తీసుకెళ్లేందుకు అధికారులు కడప జిల్లా పులివెందులలో కీలక చర్యలు ప్రారంభించారు. ముఖ్యంగా హత్య జరిగిన రాత్రి జరిగిన ఒక వాట్సాప్ కాల్‌పై ప్రత్యేక దృష్టి సారించడం కేసులో కొత్త ఆసక్తిని రేకెత్తిస్తోంది.సుప్రీంకోర్టు సూచనలతో సీబీఐ అధికారులు పులివెందుల పోలీస్ స్టేషన్‌లో కీలక విచారణ చేపట్టారు. ప్రధాన నిందితుల బంధువులైన మహేంద్ర యాదవ్, కిరణ్ కుమార్‌లకు నోటీసులు జారీ చేసి హాజరు కావాలని ఆదేశించారు. ఇప్పటికే మహేంద్ర యాదవ్ విచారణకు హాజరయ్యారు. కిరణ్ యాదవ్ సాయంత్రం 4 గంటలకు విచారణకు హాజరుకానున్నట్లు సమాచారం.

ఈ కేసులో ప్రధానంగా పరిశీలనలోకి వచ్చిన అంశం .. హత్య జరిగిన రోజు తెల్లవారుజామున 1:42 గంటలకు జరిగిన వాట్సాప్ కాల్. కిరణ్ యాదవ్ నుంచి అర్జున్ రెడ్డికి వెళ్లిన ఈ కాల్ ఎందుకు జరిగింది? ఆ సమయంలో మాట్లాడాల్సిన అవసరం ఏమిటి? అనే కోణాల్లో సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ కాల్ డేటా విశ్లేషణ ద్వారా హత్యకు ముందు, తర్వాత జరిగిన పరిణామాలపై స్పష్టత పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ నెల 20న హైదరాబాద్‌లో కిరణ్ యాదవ్, అర్జున్ రెడ్డిలను సీబీఐ అధికారులు ప్రశ్నించిన విషయం తెలిసిందే. తాజాగా పులివెందులలో జరుగుతున్న విచారణ కేసు దిశను మార్చే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం మీద, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సాగుతున్న ఈ విచారణలో ప్రతి చిన్న ఆధారాన్నీ సీబీఐ సవివరంగా పరిశీలిస్తోంది.

Tags

Next Story