CBN: హింస సృష్టించేందుకు వైసీపీ కుట్ర

CBN: హింస సృష్టించేందుకు వైసీపీ కుట్ర
X
ఏపీ ప్రజలు, నేతలకు చంద్రబాబు హెచ్చరిక... వైసీపీలో అసహనం పెరిగిపోయిందన్న సీఎం... జగన్ పార్టీ పాపాలను దారిమళ్లించే కుట్ర అన్న చంద్రబాబు

ఏపీలో శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ప్రతిపక్ష వైసీపీ వ్యవహరిస్తోందని, అధికారం కోల్పోయిన నిరాశతో ఆ పార్టీ నేతలు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారని ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో అలజడి సృష్టించడమే లక్ష్యంగా వైసీపీ నేతలు బూతులు, రెచ్చగొట్టే వ్యాఖ్యలకు దిగుతున్నారని ఆయన మండిపడ్డారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో మంత్రులు, పార్టీ సీనియర్ నేతలతో సీఎం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి, రాజకీయ పరిణామాలపై దిశానిర్దేశం చేశారు. టెలీకాన్ఫరెన్స్ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో వైసీపీ అడ్డంగా దొరికిపోయిందని ఆరోపించారు. ఈ అంశంలో నిజాలు వెలుగులోకి రావడంతో రాష్ట్ర ప్రజలంతా వైసీపీని తీవ్రంగా విమర్శిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల ఆగ్రహం నుంచి తప్పించుకోవడం, తమ తప్పులను దాచిపెట్టడం కోసమే వైసీపీ కొత్త కుట్రలకు పాల్పడుతోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు హింసాత్మక వాతావరణాన్ని సృష్టించాలన్నదే వారి ఉద్దేశమని ఆయన ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. పెట్టుబడులు ఆకర్షించి ఉపాధి అవకాశాలు పెంచడం, ఆర్థిక పురోగతికి బాటలు వేయడమే టీడీపీ ప్రభుత్వ అజెండా అని తెలిపారు.

అభివృద్ధి నచ్చని వైసీపీ

ఏపీ అభివృద్ధి దిశ వైసీపీ నేతలకు నచ్చడం లేదని, అందుకే ప్రభుత్వ కార్యక్రమాలకు అడ్డంకులు సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. రాష్ట్రం ముందుకు సాగకుండా చేయాలనే రాజకీయ ద్వేషంతోనే ప్రతిపక్షం వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. తప్పు చేసిన వారెవరైనా సరే చట్టం తన పని తాను చేసుకుపోతుందని చంద్రబాబు స్పష్టంచేశారు. చట్టానికి అతీతంగా వ్యవహరించిన ప్రతి ఒక్కరినీ న్యాయపరంగా శిక్షించి తీరుతామని హెచ్చరించారు. అదే సమయంలో టీడీపీ కార్యకర్తలు, నాయకులు సంయమనం పాటించాలని ఆయన సూచించారు. వైసీపీ రెచ్చగొట్టే వ్యాఖ్యలకు స్పందించి చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని, అలాంటి ట్రాప్‌లో పడితే మనకూ వారికీ తేడా ఉండదని చంద్రబాబు హెచ్చరించారు. పార్టీ కార్యకర్తల ప్రవర్తనపై ప్రత్యేక బాధ్యత తీసుకోవాలని మంత్రులు, సీనియర్ నేతలకు సీఎం సూచించారు. ఎక్కడా హింస, విధ్వంసం జరగకుండా చూసే బాధ్యత నాయకులదేనని పేర్కొన్నారు. కార్యకర్తలు భావోద్వేగాలకు లోనుకాకుండా, చట్ట పరిధిలోనే స్పందించేలా నాయకులు మార్గనిర్దేశం చేయాలని ఆదేశించారు. శాంతి భద్రతలు దెబ్బతింటే రాష్ట్ర ప్రతిష్ఠకే మచ్చ పడుతుందని ఆయన గుర్తుచేశారు.

వైసీపీ రాజకీయ సంస్కృతిపై కూడా చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హింస, విధ్వంసం, అవినీతి పునాదులపై ఆ పార్టీ రాజకీయాలు నిర్మితమయ్యాయని ఆరోపించారు. అలాంటి రాజకీయాల ఉచ్చులో టీడీపీ కార్యకర్తలు పడితే, ప్రజల ముందు నైతిక ఆధిక్యత కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ప్రజల విశ్వాసమే టీడీపీ బలం అని, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని పేర్కొన్నారు.

Tags

Next Story