CBN: తొక్కిసలాట దుర్ఘటనపై చంద్రబాబు సీరియస్

శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిసలాటపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఈ దుర్ఘటనపై పూర్తి విచారణకు ఆదేశించారు. ఇలాంటి దుర్ఘటనలో జరగడం చాలా దురదృష్టకరమని అన్నారు.
శ్రీసత్యసాయి జిల్లా తలుపుల మండలం పెద్దన్నవారిపల్లి గ్రామంలో శనివారం పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం మాట్లాడుతూ..."నిన్నా.. మొన్న పెద్దఎత్తున తుపాను వచ్చినా ప్రాణాలు కాపాడాలని ప్రయత్నం చేసాం. ఇద్దరు చనిపోయారు. ఈరోజు ప్రైవేటు వ్యక్తి ఏర్పాటు చేసిన కాశీబుగ్గ వెంకటేశ్వర దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా తొక్కిసలాట జరిగి 9 మంది చనిపోయారు. 5 మంది గాయపడ్డారు. చాలా బాధాకరం. ప్రాణాలు చాలా ముఖ్యం. మనం కూడా బాధ్యతగా ఉండాలి. అమాయకులు చనిపోయారు. చాలా బాధపడుతున్నాం. ఇందుకు కారణమైన వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేసి చర్యలు తీసుకుంటాం. చనిపోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. వారి ఆత్మ శాంతి కలగాలి. మనమందరం నిమిత్తమాత్రులం. " అని అన్నారు. దేవుని సన్నిధిలో చనిపోయిన వారికి నివాళులు అర్పించారు సీఎం చంద్రబాబు అనంతరం 2 నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు.
నారా లోకేశ్ తీవ్ర విచారం
కాశీబుగ్గ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో భక్తులు మరణించడంపై మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించినవారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఏకాదశి రోజున ఇంతటి తీవ్ర విషాద ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. కాసేపట్లో ఆయన కాశీబుగ్గకు వెళ్లి.. అక్కడి పరిస్థితిని స్వయంగా సమీక్షించనున్నారు. కాగా.. మధ్యప్రదేశ్ లోని భోపాల్ పర్యటనలో ఉన్న జిల్లా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు విషయం తెలిసిన వెంటనే అక్కడి నుంచి బయల్దేరారు. కాగా.. తొక్కిసలాటలో గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలని హోంమంత్రి అనిత అధికారులను ఆదేశించారు. ఆలయం మొదటి అంతస్తులో ఉండటం, 20 మెట్లు ఎక్కి పైకి వెళ్లే క్రమంలో రెయిలింగ్ ఊడిపడటంతో ప్రమాదం జరిగినట్లుగా మంత్రి తెలిపారు. మృతుల్లో మహిళా భక్తులు ఎక్కువగా ఉండటం బాధాకరమన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

