CBN: నీటి విషయంలో రాజకీయం చేయవద్దు

గోదావరి జలాల వినియోగంపై రాజకీయ వివాదాలు అవసరం లేదని, ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నీటి వనరుల విషయంలో భావోద్వేగాలకు కాకుండా వాస్తవాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. తెలుగు జాతి ఐక్యతతో ముందుకు సాగితేనే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. గోదావరి నదిలో పుష్కలంగా నీరు ప్రవహిస్తున్న తరుణంలో, పోలవరం ప్రాజెక్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేయడం సరికాదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. సముద్రంలో కలిసిపోయే నీటిని వినియోగించుకోవడంపై ఎవరికీ అభ్యంతరం చెప్పే హక్కు లేదన్నారు. నీటి వనరుల విషయంలో రాజకీయాలు చేయకుండా, ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలని తెలంగాణ నేతలను ఆయన కోరారు.
అనవసరమైన అపోహలు
రాజకీయ నాయకులు పోటీ పడి వ్యాఖ్యలు చేయడం వల్ల ప్రజల్లో అనవసరమైన అపోహలు ఏర్పడతాయని, ఇది మంచిది కాదని చంద్రబాబు తెలిపారు. గోదావరి నీటిపై వివాదాలు సృష్టించకుండా, అక్కడి ప్రజలు కూడా వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవాలని సూచించారు. తెలుగు జాతి ఒక్కటేనని, ఇచ్చిపుచ్చుకునే భావనతో రాష్ట్రాలు కలిసి ముందుకు వెళ్లాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు పెరిగి, ఎవరో ఆనందించే పరిస్థితి రాకూడదని ఆయన హెచ్చరించారు. భావోద్వేగాలతో రాజకీయాలు చేయడం వల్ల ప్రయోజనం ఉండదని, ప్రజల సంక్షేమమే రాజకీయాల లక్ష్యంగా ఉండాలని చంద్రబాబు అన్నారు. గతంలో ఆర్టీఎస్‌కు నీళ్లు అందని సమయంలో జూరాల ప్రాజెక్టు నుంచి నీటిని తీసుకువచ్చి మహబూబ్‌నగర్‌కు అందించామని గుర్తు చేశారు. దేవాదుల, కల్వకుర్తి వంటి కీలక ప్రాజెక్టులకు తానే శ్రీకారం చుట్టానని, దేవాదుల ప్రాజెక్టును మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఎవరైనా అడ్డుకున్నారా అని ప్రశ్నించారు.
ఎంతో సంతృప్తి
ప్రాజెక్టులపై అన్యాయం జరుగుతుందని భావించి తాను గతంలో పర్యటనలు చేసినందుకు అరెస్టు కూడా అయ్యానని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తనకన్నా ఎక్కువ అవమానాలు ఎదుర్కొన్న నాయకుడు లేడని ఆయన వ్యాఖ్యానించారు. ఒకప్పుడు ఇంకుడు గుంతలు తవ్వించడంపై తనను ఎగతాళి చేసిన వారు ఉన్నారని, అయితే భూగర్భ జలాల రీచార్జ్ కోసం తాము చేసిన కృషి ఫలితంగా నేడు గ్రౌండ్ వాటర్ స్థాయులు పెరుగుతున్నాయని తెలిపారు. ఈ మార్పు చూసి ఎంతో సంతృప్తిగా ఉందన్నారు. ఇటీవల కొందరు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తే రాజకీయాలే అర్థం కాని పరిస్థితి నెలకొందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. గోదావరి నదికి ఎగువన దేవాదుల ప్రాజెక్టు ఉందని, అక్కడి నుంచి నీళ్లు వస్తే అవి చివరికి పోలవరం ప్రాజెక్టుకు చేరతాయని చెప్పారు. అలాంటి పరిస్థితిలో కిందకు వచ్చే నీళ్లపై అభ్యంతరం చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
వైసీపీ ప్రభుత్వం కారణంగానే...
రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టులపై జరుగుతున్న వ్యాఖ్యల్లో అర్థం లేదని ఆయన విమర్శించారు. అబద్ధాన్ని వందసార్లు చెబితే అది నిజమవుతుందని కొందరు భావిస్తున్నారని అన్నారు. సముద్రంలోకి వెళ్లే నీటిని అడ్డుకోవడం వల్ల లాభాలూ ఉంటాయని, అదే సమయంలో కొన్ని నష్టాలు కూడా ఉండవచ్చని స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం కారణంగానే ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా భావించే పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడంలో ఆరు నుంచి ఏడు సంవత్సరాల ఆలస్యం జరిగిందని చంద్రబాబు ఆరోపించారు. ఐఐటీ హైదరాబాద్ నిపుణులు చెప్పిన తర్వాతే డయాఫ్రం వాల్ దెబ్బతిన్న విషయం గత ప్రభుత్వానికి తెలిసిందన్నారు. భవిష్యత్తులో వచ్చే విపత్తులను దృష్టిలో పెట్టుకుని, మరింత భద్రతతో కొత్త డయాఫ్రం వాల్‌ను నిర్మిస్తున్నామని ఆయన తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

